Bison : సుమారు ఆరువేల సంవత్సరాల తర్వాత బ్రిటన్‌లో తొలిసారిగా ఓ బైసన్ పుట్టడం పట్ల అటవీశాఖ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలల క్రితం పుట్టిన దున్నకు సంబంధించిన తాజా చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. లిజ్ ట్రస్ ప్రధానిగా ఉన్నప్పుడు బైసన్ జన్మించింది. అందువల్ల స్థానికులు అడవి గేదెకు లిజ్ అని ముద్దుగా పేరు పెట్టారు. కానీ అటవీశాఖ మాత్రం ఇంతవరకు ఆ దున్నకు అధికారికంగా పేరు పెట్టలేదు.
గత ఏడాది జూలైలో, కెంట్‌లోని వెస్ట్ బ్లీన్ వుడ్స్ అడవుల్లోకి బైసన్ మందను ప్రవేశపెట్టారు. తరువాత సెప్టెంబర్ 9 న, లిజ్ జన్మించింది. ఆరు నెలల తర్వాత తీసిన ఫోటోల్లో లిజ్ సంపూర్ణ ఆరోగ్యంగా కనిపిస్తోంది. కొమ్ములు ఇప్పుడిప్పుడే వస్తున్నట్లు కనిపిస్తోంది. వైల్డ్ వుడ్ ట్రస్ట్ కోసం జూలాజికల్ ఆపరేషన్స్ డైరెక్టర్ మార్క్ హబెన్ మాట్లాడుతూ, బ్రిటన్ చరిత్రలో బైసన్ ఆరోగ్యకరంగా ఎదుగుతున్నట్లు తెలిపారు.
Read Also: Dr Care Summer Health Camp: వేసవిలో ఊరట.. డా.కేర్ సమ్మర్ హెల్త్ క్యాంప్
అటవీశాఖలో బైసన్‌ను పునరుజ్జీవింపజేసే కార్యక్రమం విజయవంతమైందనడానికి అటవీ అధికారులు లిజ్ పుట్టుకను ఉదాహరణగా భావిస్తున్నారు. లిజ్ తన శరీరాన్ని చెట్లకు రుద్దడం, బురదలో స్నానం చేయడం వంటి ఇతర బైసన్‌ల పద్ధతులను అవలంబించడం ప్రారంభించింది. అదే సమయంలో, బైసన్‌తో పాటు బ్రిటన్‌లో అంతరించిపోయిన అనేక జంతువులను తిరిగి అడవుల్లోకి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఎక్సమూర్ పోనీలు, ఇనుప యుగం నాటి పందులు, పొడవాటి కొమ్ము పశువులను రానున్న వారాల్లో తిరిగి అడవుల్లోకి తీసుకురానున్నారు.
వీరిని ప్రజలు కూడా దగ్గరగా చూసే అవకాశం ఉంటుందని సమాచారం. కానీ, బైసన్‌ను దగ్గరగా చూడటానికి అనుమతించరు. వీటిని 50 హెక్టార్ల కంచె ప్రాంతంలో ఉంచారు. త్వరలో వీటి ఆవాసాలను 200 హెక్టార్లకు విస్తరించాలని నిర్ణయించారు. పీపుల్స్ పోస్ట్‌కోడ్ లాటరీ ద్వారా సేకరించిన నిధులు జంతువులను తిరిగి అడవిలోకి ప్రవేశపెట్టడానికి ఉపయోగించబడుతున్నాయి.
Read Also:DK Aruna: అరెస్టయిన వారు పదే పదే కవిత పేరు ఎందుకు చెబుతున్నారో..
అటవీ ప్రాంతంలో అడవి దున్నలు చురుగ్గా మారడంతో సహజసిద్ధమైన మార్గాలను కూడా సిద్ధం చేయడం ప్రారంభించాయి. అడవిలో ఈ మార్పులు ఆశాజనకంగా ఉన్నాయని వైల్డర్ బ్లీన్ ప్రాజెక్ట్ మేనేజర్ స్టాన్ స్మిత్ చెప్పారు. అడవుల్లోకి తీసుకొచ్చిన జంతువుల ఆరోగ్యం, భద్రతను పరిశీలిస్తున్నారు.