బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ నివాసంపై కాల్పుల కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో ఇద్దరు నిందితుల్ని గుజరాత్‌లో అరెస్ట్ చేశారు. అలాగే వారి దగ్గర నుంచి ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కాల్పుల వెనుక పెద్ద స్కెచ్ ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీరియస్‌గా తీసుకున్న ముంబై పోలీసులు లోతుగా విచారణ చేస్తు్న్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీ నుంచి ముంబై వచ్చిన పోలీసులు.. బుధవారం మూడు గంటల పాటు నిందితుల్ని విచారించారు. నిందితుల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు ముంబై క్రైమ్ బ్యాంచ్ పోలీసులు తెలిపారు. సల్మాన్‌ఖాన్ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించి విక్కీ గుప్తా, సాగర్ పాల్ కాల్పులకు పాల్పడ్డారు. ఈనెల 14న ఈ ఘాతునికి తెగబడ్డారు. అయితే సల్మాన్‌ఖాన్ నివాసంలో మాత్రం బుల్లెట్లు లభించాయి. నిందితుల్ని 9 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. 14 రోజులు కోరగా.. కేవలం తొమ్మిది రోజులు మాత్రమే ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Heatwave effect: బీహార్‌లో పోలింగ్ సమయం పెంచిన ఈసీ.. ఎన్ని గంటలంటే..!
ఇదిలా ఉంటే సల్మాన్‌ఖాన్ నివాసంపై కాల్పుల ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇక ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే.. స్వయంగా సల్మాన్ నివాసానికి వచ్చి పరామర్శించారు. కుటుంబ సభ్యుల్ని పలకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటన వెనుక ఎంతటి వారు ఉన్న కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు.
కాల్పుల వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి ఎవరు?, కాల్పులకు అసలు కారణమేంటో పోలీసులు తెలుసుకుంటున్నారు. ఈ ఘటనకు బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించిందని నిందితులు పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించారని పోలీసులు తెలిపారు. నిందితులు నవీ ముంబై పన్వెల్‌లోని హరిగ్రామ్ ప్రాంతంలో నెల రోజులుగా అద్దె ఇంట్లో మకాం వేసినట్లు అధికారి తెలిపారు. సల్మాన్‌కు పన్వెల్‌లోనే ఫాంహౌస్ ఉంది.
ఏప్రిల్ 14న (ఆదివారం) ఉదయం ఐదు గంటల సమయంలో బాంద్రా ప్రాంతంలో సల్మాన్ ఉండే గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ దగ్గరకు మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. హెల్మెట్ ధరించి బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఈ కాల్పులకు తెగబడ్డారు. బాల్కనీలో పడ్డ బుల్లెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అంతర్జాతీయ ముఠా ప్రమేయం ఏమైనా ఉందన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బీహార్, హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. సల్మాన్‌ఖాన్‌ను భయపెట్టేందుకే ఈ కాల్పులు జరిపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు బీహార్‌కు చెందిన వారు కావడంతో అక్కడికి కూడా పోలీసులను పంపించారు. కారణాలు తెలుసుకునేందుకు నిందితుల కుటుంబ సభ్యుల్ని కూడా విచారించనున్నారు.
ఇది కూడా చదవండి: KCR: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయ్