Sanna Marin: అతిచిన్న వయస్సులోనే దేశ అత్యున్నత పదవిని చేపట్టారు ఫిన్‌లాండ్ ప్రధాని సనా మారిన్. పదవిని చేపట్టడమే కాకుండా డైనమిక్ పీఎంగా పేరు కూడా తెచ్చుకున్న సనా మారిన్ ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. తాజా ఫిన్‌లాండ్ ప్రధాని సనా మారిన్ విడాకులు తీసుకోనున్నట్లు ప్రకటించారు. తన మూడేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆమె సోషల్‌మీడియాలో ప్రకటించారు. తన భర్త మార్కస్ రైకోనెన్‌తో కలిసి విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. ‘‘మేమిద్దం విడాకులకు దరఖాస్తు చేసుకున్నాం. మేం చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం. కలిసి పెరిగాం. 19 ఏళ్లుగా కలిసే ఉన్నాం. ఇప్పటికీ మేం మంచి స్నేహితులమే. మా ప్రియమైన కుమార్తెకు తల్లిదండ్రులమే. ఒక కుటుంబంగా మా కుమార్తె కోసం సమయాన్ని వెచ్చిస్తాం’’ అని ప్రధాని సనా మారిన్ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.
Read Also: Pakistan: ఇమ్రాన్ అరెస్ట్‌తో భగ్గుమన్న పాకిస్థాన్.. అల్లర్ల అణచివేతకు రంగంలోకి సైన్యం
వ్యాపారవేత్త, మాజీ ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్ అయిన మార్కస్ రైకోనెస్‌తో సనా మారిన్ కొన్నాళ్ల పాటు సహజీవనం చేశారు. వీరి బంధానికి గుర్తుగా ఓ కుమార్తె జన్మించింది. సనా మారిన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఏడాది తర్వాత 2020లో వీరిద్దరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే మూడేళ్లకే వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 37 ఏళ్ల మారిన్, ఆమె 2019లో అధికారం చేపట్టినప్పుడు ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన ప్రధాన మంత్రిగా నిలిచారు. కొవిడ్ సమయంలో ఎన్నో నూతన విధానాలను అమల్లోకి తెచ్చి ఐరోపా సమాఖ్యతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే, ప్రజాధనం వ్యయం, పార్టీల్లో పాల్గొనడం వంటి వ్యవహారాలపై విమర్శలు రావడంతో ఆమె పాపులారిటీ తగ్గిపోయింది. దీంతో మారిన్ రాజీనామా చేశారు. అయితే, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతున్నారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సనా మారిన్ పార్టీ ఓటమిపాలైంది. కన్జర్వేటివ్ పార్టీ (ఎన్‌సీపీ) విజయం సాధించింది. దీంతో త్వరలోనే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అప్పటి వరకు సనా మారిన్ ప్రధానిగా కొనసాగనున్నారు.