గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ మాట్లాడుతూ.. మొడికుంట వాగు, గూడెం ఎత్తిపోతల డీపీఆర్ ల పై చర్చించామని వెల్లడించారు. ఏపీ కొన్ని సాధారణ అభ్యంతరాలు లేవనెత్తిందన్నారు. నీటి లభ్యత ఉందని కేంద్ర జలసంఘం డైరెక్టర్ వివరణ ఇచ్చారన్నారు. త్వరలోనే అనుమతులు వస్తాయని భావిస్తున్నామన్నారు. పోలవరం అంశాన్ని ప్రస్తావించామని, పీపీఏలో చర్చించాలని సూచించారన్నారు. గోదావరిలో మిగుల జలాల లభ్యత కోసం అధ్యయనం అంశాన్ని సీడబ్ల్యూసీకి నివేదించాలని నిర్ణయంచారన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ఎన్జీటీ తీర్పుపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని నిర్ణయించామని, పూర్తి స్థాయిలో కసరత్తు చేసి వారం రోజుల్లో పిటిషన్ వేస్తామన్నారు. అనంతరం తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మాట్లాడుతూ.. పెద్దవాగు ప్రాజెక్టును త్వరగా ఆధునీకరించాలని కోరామని తెలిపారు. మొదటి ప్రాధాన్యంలో ఐదు అంతర్ రాష్ట్ర సరిహద్దు పాయింట్ల వద్ద టెలిమెట్రీ ఏర్పాటుకు నిర్ణయం జరిగిందన్నారు. ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. గోదావరిలో ఎంత నీరు ఉంది, ఏ రాష్ట్రానికి ఎంత వాటా ఉందో తేల్చాలని అడిగామన్నారు.
Also Read : Bandi Sanjay : BRSకు జాతీయ అధ్యక్షుడు లేడు.. సొంత రాష్ట్రానికి అధ్యక్షుడిని ప్రకటించ లేదు
అందుబాటులో ఉన్న నీటిని శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని బోర్డు నిర్ణయించిందన్నారు. సీబ్ల్యూసీకిచే అధ్యయనం చేయించాలని నిర్ణయం జరిగిందన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై మాకు అభ్యంతరాలు ఉన్నాయని పదేపదే చెప్తున్నప్పటికీ సాధారణ న్యాయాన్ని కూడా పాటించడం లేదన్నారు. నీటి లభ్యత ఉండగా గూడెంలో అదనపు ఎత్తిపోతల అవసరం ఏమిటని ప్రశ్నించామన్నారు. గూడెం ఎత్తిపోతలతో ప్రజాధనం దుర్వినియోగం అని చెప్పామని, టెలిమెట్రీ ఐదు చోట్లనే ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరిందన్నారు. ఎక్కువ చోట్ల ఏర్పాటు చేయాలని ఏపీ తరపున కోరామన్నారు. పోలవరం అంశం చర్చించేందుకు గోదావరి బోర్డు సరైన వేదిక కాదని చెప్పామన్నారు. పోలవరంపై తెలంగాణ అభ్యంతరాలపై ఇప్పటికే చర్చించామని, సమస్యలు పరిష్కారం అయ్యాయన్నారు.