Rahul Gandhi: బెంగళూరు వేదికగా విపక్షా కూటమి రెండు రోజు సమావేశం ముగిసింది. ఉదయం 11 నుంచి ప్రారంభించి మధ్యాహ్నం 4 గంటల వరకు భేటీ జరిగింది. దాదాపు 26 ప్రతిపక్ష పార్టీలు సమావేశంలో పాల్గొన్నాయి. బీజేపీకి పోటీగా ఏకమైన ప్రతిపక్ష పార్టీల కూటమికి కొత్త పేరును నిర్ణయించారు. ఈ మేరకు మహాకూటమి పేరును ‘INDIA’ (ఇండియన్ నేషనల్ డిమోక్రటిక్ ఇంక్లూజివ్ అలయెన్స్) పేరును ఖరారు చేశారు. అయితే.. అలయెన్స్ (కూటమి) అనే పదంపై పునరాలోచన జరపాలని వామపక్ష పార్టీలు కోరినట్లు సమాచారం.
Also Read: WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్.. కొత్త నెంబర్ సేవ్ చేయకుండానే చాట్ చేసే ఛాన్స్
ఇదిలా ఉండగా.. బీజేపీ సిద్దాంతాలతోనే విపక్ష కూటమి పోరాటం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. విపక్ష కూటమి సమావేశం ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. అధికారం కోసం దేశాన్ని ఆక్రమించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇది బీజేపీ, విపక్ష పార్టీల మధ్య యుద్ధం కాదన్న రాహుల్ గాంధీ.. ఇది దేశ ప్రజల స్వతంత్రం,స్వేచ్ఛ కోసం చేస్తున్న యుద్ధంగా ఆయన పేర్కొన్నారు. తమ పోరాటం ఎన్డీఏ వర్సెస్ ఇండియాగా ఉంటుందన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందన్నారు. కొద్దిమంది చేతుల్లోకి దేశం వెళ్లిపోతుందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: Opposition Alliance: విపక్షాల కూటమి కొత్త పేరు INDIA..
భారత్ ఆలోచనపై దాడి జరుగుతోందని ఆయన ఆరోపించారు. కోట్లాది మంది భారతీయుల నుంచి భారత స్వరాన్ని లాక్కొని నరేంద్ర మోడీకి సన్నిహితంగా ఉండే కొద్దిమంది వ్యాపారులకు ఇస్తున్నారని ఆరోపణలు చేశారు. ధరలు పెరుగుతున్నా కూడా పట్టించుకోవడం లేదని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. రెండు ఆలోచనల విధానాలకు వ్యతిరేకంగా పోరు సాగుతుందన్నారు. ఇండియాను రక్షించేందుకు తాము పోరాటం చేస్తున్నామని రాహుల్ గాంధీ చెప్పారు. ఇండియాను వ్యతిరేకించేవారికి ఏ గతి పడుతుందో మీకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు.తమ ఆలోచనా విధానం దేశం కోసమేనని రాహుల్ గాంధీ చెప్పారు. తమ భవిష్యత్ కార్యాచరణను ముంబై సమావేశంలో ప్రకటిస్తామన్నారు.