తెలుగు చిత్రసీమలో ‘కౌబోయ్’ అన్న మాట వినగానే ముందుగా గుర్తుకు వచ్చే హీరో ఎవరంటే నటశేఖర కృష్ణ పేరే వినిపిస్తుంది. కృష్ణ హీరోగా రూపొందిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ తెలుగునాట తొలి కౌబోయ్ మూవీగా జేజేలు అందుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. దాంతో వరుసగా కృష్ణతో ఆ తరహా చిత్రాలు నిర్మించడానికి నిర్మాతలు సిద్ధమయ్యారు. అలా కృష్ణతో “మొనగాడొస్తున్నాడు జాగ్రత్త, మావూరి మొనగాళ్ళు” వంటి కౌబోయ్ మూవీస్ వచ్చాయి కానీ, అంతగా అలరించలేక పోయాయి. ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్ర దర్శకుడు కె.యస్.ఆర్. దాస్ దర్శకత్వంలో కృష్ణ హీరోగా తెరకెక్కిన రంగుల చిత్రం ‘మంచివాళ్ళకు మంచివాడు’ కూడా కౌబోయ్ మూవీగా ఆదరణ పొందింది. 1973 జనవరి 13న సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనం ముందు నిలచింది. శ్రీవేంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై కృష్ణ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కింది.
ధర్మపురి జమీందార్ ధర్మారాయుడు ప్రజలు కష్టాల్లో ఉన్నసమయంలో ఉపయోగపడుతుందని ఓ నిధిని దాచిపెట్టి ఉంటాడు. ఆయన గతించిన తరువాత ఆ నిధిని దోచుకోవాలని వారి దాయాది సేతుపతి ప్రయత్నిస్తాడు. యువరాజు కుమారరాజాను ఎత్తుకు వెళతారు. అంగరక్షకుడు నాగమనాయుని కాలుస్తారు. అతను చనిపోతూ నిధికి దారి చూపే పతకాన్ని రంగా అనే యువకునికి అందిస్తాడు. నాగమనాయునికి ఆశ్రయమిచ్చిన వారందరినీ సేతుపతి చంపుతూ వస్తాడు. అలా కన్నవారిని పోగొట్టుకున్న ఓబయ్య, రంగా కలుసుకుంటారు. తమ కన్నవారిని పొట్టన పెట్టుకున్నవారిపై పగ సాధించడానికి వారిద్దరూ ఓ పథకం వేస్తారు. వారికి తుపాకి సాకీ అనే అమ్మాయి సహకరిస్తుంది. సేతుపతి నిధి కోసం పలువురిని చంపుతాడు. కొందరు దొంగలతో దోస్తీ చేస్తాడు. వాడు చివరకు రంగ, ఓబయ్యకు దొరుకుతాడు. ఓబయ్య వాడిని చంపేసి తన పగ తీర్చుకుంటాడు. అలాగే సేతుపతి దగ్గర ఉన్న కుమార రాజాను రక్షిస్తాడు. తమకు సాయం చేసిన తుపాకి సాఖి అసలు పేరు ప్రియంవదా దేవి అని, ఆమె జమీందారు వారసురాలని తెలుస్తుంది. ఎంతోమంది పేద ప్రజలకు చెందవలసిన నిధిని రక్షించిన రంగాతోనే ప్రియంవద జోడీ కట్టడంతో కథ ముగుస్తుంది.
కృష్ణ, విజయనిర్మల జంటగా నటించిన ఈ చిత్రంలో నగేశ్, సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, త్యాగరాజు, జగ్గారావు, రావు గోపాలరావు, సాక్షి రంగారావు, సిహెచ్. నారాయణరావు, నిర్మల, హలం, కాకరాల, ఉదయలక్ష్మి, షబ్నమ్, వల్లూరి బాలకృష్ణ, గోకిన రామారావు, మాస్టర్ రాము ముఖ్యపాత్రధారులు. ఈ చిత్ర నిర్మాత యస్. భావనారాయణ సమకూర్చిన కథకు పాలగుమ్మి పద్మరాజు, అప్పలరాజు మాటలు రాశారు. సత్యం స్వరకల్పన చేసిన ఈ చిత్రంలో శ్రీశ్రీ, దాశరథి, సినారె, ఆరుద్ర పాటలు పలికించారు. ఇందులోని “పిల్లా…షోకిల్లా…”, “ఏమయ్యో మొనగాడా…”, “వెండి మబ్బు విడిచింది…”, “లేనే లేదా అంతం…” అంటూ సాగే పాటలు అలరించాయి. ఈ సినిమా ‘మోసగాళ్ళకు మోసగాడు’ స్థాయిలో అలరించకున్నా, ఆ తరువాత ఆకట్టుకున్న తెలుగు కౌబోయ్ మూవీగా నిలచింది. రిపీట్ రన్స్ లోనూ ఆదరణ చూరగొంది.