Betting: ఇటీవల యువకులు బెట్టింగ్ అనే వ్యసనానికి బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. జీవితం చిన్నాభిన్నమై చివరకు ప్రాణాలు తీసుకుంటున్నారు. చివరకు కన్నవారికి కడుపుకోతను మిగులుస్తున్నారు. కానీ తాజాగా బెట్టింగ్‌కు బానిసై కోట్లు పోగొట్టిన కొడుకును కన్న తండ్రే రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం బగిరాత్ పల్లిలో చోటుచేసుకుంది.
Read Also: Kami Rita Sherpa: తన రికార్డును తానే బద్దలు కొడుతూ.. ఎవరెస్ట్‌ను అత్యధికసార్లు అధిరోహించిన వ్యక్తి..
బగిరాత్‌పల్లికి చెందిన ముకేష్‌కుమార్(28) బెట్టింగ్, జల్సాలకు అలవాటు పడ్డాడు. బెట్టింగ్‌లు మానుకోవాలని కొడుకుని తండ్రి సత్యనారాయణ పలుమార్లు హెచ్చరించాడు. ఎన్నిసార్లు చెప్పినా ముకేష్ మారకపోవడంతో శనివారం రాత్రి కుమారుడిపై తండ్రి సత్యనారాయణ దాడి చేశాడు. ఇనుపరాడ్డుతో ముకేష్ తలపై బలంగా కొట్టడంతో తీవ్రగాయాలై కుమారుడు ముకేష్ కుమార్ ప్రాణాలు విడిచాడు. మృతుడు ముఖేష్ కుమార్ చేగుంట మండలం మల్యాలలో రైల్వే ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ముకేష్ బెట్టింగ్ వ్యసనం కారణంగా మేడ్చల్‌లోని ఆస్తులు అమ్ముకున్నామని కుటుంబసభ్యులు వెల్లడించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.