ఫాల్కన్ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో ముఖ్యమైన అడుగు వేసింది. అమర్దీప్ కుమార్‌కు చెందిన హాకర్ 800A ప్రైవేట్ విమానాన్ని స్వాధీనం చేసుకున్న ఈడీ, ఇప్పుడు దానిని అధికారికంగా వేలం వేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫాల్కన్ స్కాం బహిర్గతమైన వెంటనే అమర్దీప్ మరియు అతని గ్యాంగ్ ఇదే విమానంలో దుబాయ్‌కి పారిపోయిన విషయం తెలిసిందే.
తర్వాత భారత్‌కు తిరిగి వచ్చిన ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఈడీ స్వాధీనం చేసుకుని, ప్రస్తుతం బేగంపేట విమానాశ్రయంలో నిలిపి ఉంచింది. విమానం చెడిపోకుండా, ఉపయోగించడానికి వీలుగా ఉండేందుకు వేలం వేసేందుకు కోర్టు అనుమతి కూడా తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈడీ ప్రకటన ప్రకారం, ఎంఎస్టీసీ లిమిటెడ్ ద్వారా ఈ విమానం అమ్మకానికి ఉంచబడుతోంది. డిసెంబర్ 7న విమానం పరిశీలనకు అందుబాటులో ఉండగా, డిసెంబర్ 9న ఆన్లైన్ వేలం జరగనుంది. ఈ విమానం విక్రయం ద్వారా వచ్చే మొత్తాన్ని ఫాల్కన్ స్కాం వల్ల నష్టపోయిన బాధితులకు పరిహారంగా చెల్లించనున్నట్లు ఈడీ స్పష్టం చేసింది.
సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్స్ వింగ్ 2025 ఫిబ్రవరి 11న నమోదు చేసిన మూడు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ విచారణను ప్రారంభించింది. దర్యాప్తులో ఫాల్కన్ గ్రూప్ పేరుతో అమర్దీప్ కుమార్ నకిలీ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కీమ్ నడిపి, పెట్టుబడిదారులను మొత్తం ₹792 కోట్లు మోసగించినట్లు ఈడీ గుర్తించింది. ప్రస్తుతం అమర్దీప్ విదేశాల్లో తలదాచుకొని ఉన్నాడు. అయితే అతని సోదరుడు సందీప్ కుమార్, చార్టర్డ్ అకౌంటెంట్ శరద్ చంద్ర టోష్నీవాల్, క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ COO ఆర్యన్ సింగ్ ఛబ్రాలను ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేశారు.
అంతేకాకుండా, ఈడీ ఇప్పటివరకు ₹18.63 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఫాల్కన్ స్కాం బాధితులకు న్యాయం అందించడంలో భాగంగా చేపట్టిన ఈడీ చర్య, దర్యాప్తులో ఒక కీలక దశగా భావిస్తున్నారు. పెట్టుబడిదారుల డబ్బుతో కొనుగోలు చేసిన విమానం విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని వారికి తిరిగి చెల్లించడం ద్వారా కొంత ఉపశమనం లభించబోతోందని బాధితులు ఆశిస్తున్నారు.
Maruti Suzuki: మారుతి సుజుకి చరిత్ర.. 30 రోజుల్లో 2.29 లక్షల కార్ల విక్రయాలు!