దేశంలో ప్రముఖ రైడ్-హైలింగ్ సర్వీసులలో ఒకటైన ఓలా క్యాబ్స్ కీలక మార్పులు చేసింది. మంగళవారం నుంచి నాన్–ఏసీ రైడ్స్‌ను అధికారికంగా ప్రారంభించింది. దేశంలో తొలిసారిగా ఈ సేవను అందిస్తున్న సంస్థగా ఓలా కంపెనీ గుర్తింపు పొందింది. ఈ కొత్త ఎంపికతో కస్టమర్లకు మరిన్ని ఆప్షన్లు లభిస్తాయని, ఇది వినియోగదారుల పట్ల తమ నిబద్ధతను ప్రతిబింబించే నిర్ణయమని యాజమాన్యం తెలిపింది.
కంపెనీ ప్రతినిధుల వివరాల ప్రకారం, అర్బన్ ప్రాంతాల్లో నాన్–ఏసీ రైడ్స్ చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉండనున్నాయి. దినసరి ప్రయాణ అవసరాలను చౌకగా తీర్చేందుకు ఈ నిర్ణయం సహాయపడుతుందన్నారు. ప్రజల ప్రయాణ ధరలకు ప్రాధాన్యం ఇచ్చి ఈ సేవలను ప్రారంభించామని వారు పేర్కొన్నారు.
అయితే.. నాన్–ఏసీ రైడ్ మోడ్ వల్ల తక్కువ ఏసీ వినియోగం, ఇంధన వాడకం, అలాగే డ్రైవర్లకు మెరుగైన ఆదాయం లభించవచ్చని కంపెనీ తెలిపింది. సరసమైన ధరల్లో ప్రయాణించాలని వినియోగదారులు కోరుకుంటున్న నేపథ్యంలో ఈ సేవను అందిస్తున్నట్టు యాజమాన్యం వెల్లడించింది.