Falaknuma Express: ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఎలాంటి భద్రతా చర్యలు పాటించలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైళ్లలో సిగరెట్ల విక్రయిస్తున్నా పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. ఇంతకీ సిగరెట్ కాల్చింది ఎవరు? దక్షిణ మధ్య రైల్వేకు ఇటీవల హెచ్చరిక లేఖ వచ్చినా…అధికారులు ఎందుకు అప్రమత్తం కాలేదు. ఇలా ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఘటనాస్థలానికి వెళ్లిన రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్…ప్రమాదానికి కారణాలపై ఆరా తీశారు. పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు.
బోగీలు దగ్ధం వెనుక విద్రోహ చర్య ఏదైనా ఉందా అనే కోణంలో రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే మూడు రోజుల క్రితం దక్షిణ మధ్య రైల్వేకు వచ్చిన బెదిరింపు లేఖ ఈ అనుమానాలను బలపరుస్తోంది. ఒడిశాలోని బాలాసోర్ తరహాలో మరో ప్రమాదం వారం రోజుల్లో జరుగుతుందని ఆగంతకుల లేఖలో హెచ్చరించారు. హైదరాబాద్, ఢిల్లీ రూట్‌లో రైలు ప్రమాదం జరుగుతుందని ఆ లేఖలో హెచ్చరించారు. ఈ లేఖపై పోలీసులకు ఫిర్యాదుచేశారు రైల్వే అధికారులు. ఇంతలో ఫలక్‌నుమా ట్రైన్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంపై పూర్తిస్తాయి విచారణకు ఆదేశించారు దక్షిణ మధ్య రైల్వే జీఎం.
ప్రమాదానికి గురైన బోగీలను వేరే ఇంజిన్‌కు అటాచ్ చేసి… బీబీనగర్ స్టేషన్‌కు తరలించారు. కాలిపోయిన బోగీలను వదిలేసి మిగిలిన బోగీలతో రైలు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకున్నాక…తనిఖీల కోసం షెడ్డుకు తరలించారు. బహానాగా రైలు ప్రమాదాన్ని తలపించిందని …చైన్ లాగిన తర్వాత స్లో కావడంతో కిందకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నామన్నారు ప్రయాణికులు. ప్రమాదానికి అసలు కారణాలేంటి..? సిగరెట్ వల్లే ప్రమాదం జరిగిందా..? షార్ట్ సర్క్యూట్‌తో మంటలు రాజుకున్నాయా? కుట్ర కోణం ఉందా? ఇటీవల వచ్చిన బెదిరింపు లేఖతో ఈ ప్రమాదానికి ఏమన్నా సంబంధం ఉందా..? ఇలా భిన్న కోణాల్లో రైల్వే ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ప్రయాణికుల వివరాలు తీసుకున్నారు పోలీసులు.