కృష్ణా జిల్లా ఉయ్యూరులో స్వామీజీల పేరుతో బెదిరింపులకు దిగిన ఘటన కలకలం రేపింది. ఆకునూరు గ్రామంలో పారిశ్రామిక వేత్త ఇంటికి తమిళనాడు నుంచి వచ్చిన స్వామీజీలమని చెప్పి బెదిరింపులకు దిగటంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. తాము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే శపిస్తామని వృద్ధ మహిళను బెదిరించినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ కంత్రీ బాబాలు ఎవరు? వారి మోటో ఏంటి?
కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలంలో ఉన్న ఆకునూరు గ్రామంలో ఓ పారిశ్రామికవేత్త ఇంట్లో దొంగబాబాలు హల్‌చల్ చేశారు. ఏకంగా లక్ష రూపాయలు కావాలని ఇంట్లో ఉన్న వృద్దులను అదరగొట్టారు. లేదంటే శపిస్తామని చెప్పి బెదిరించారు. ఇంట్లో వృద్దులు మాత్రమే ఉండడంతో ఈ దురాగతానికి తెగబడ్డట్లు తెలుస్తోంది
పారిశ్రామికవేత్త ఫిర్యాదుతో కేసు నమోదు
ఈ ఘటనపై పారిశ్రామికవేత్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు షురూ చేశారు. ఈ క్రమంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఉయ్యూరు రూరల్ ఎస్సై సుభాషిని బాధిత వృద్ధ మహిళతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు…
స్వామీజీల మాదిరిగా వచ్చిన వ్యక్తులు తమిళనాడు ప్రాంతానికి చెందిన వాహనంలో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వారు వినియోగించిన వాహనానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ని టోల్ ప్లాజాతోపాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రధాన రోడ్లలో ఉన్న సిసిటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా సేకరించారు. వారు వినియోగించిన వాహనంపై తమిళనాడు ఆలిండియా హిందూ ఫెడరేషన్ అన్ని స్టిక్కరింగ్ కూడా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. అసలు ఈ వ్యక్తులు వినియోగించిన వాహనానికి ఉన్న నెంబర్ ప్లేట్ అసలైనదా లేక నకిలీదా అనేది కూడా గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. దీంతోపాటు ఇక్కడికి రావటానికి ముందు స్థానికంగా ఉన్నటువంటి విజయవాడ గాని ఇతర ప్రాంతాల్లో ఈ వాహనం రాకపోకలు ఏమైనా జరిగాయా? అనేది పరిశీలిస్తున్నారు.
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అయి ఉంటుందని అనుమానం
ప్రస్తుతం లభించిన సీసీ ఫుటేజీ క్లూ ఆధారంగా అసలు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. వచ్చిన వారు అంతర్రాష్ట్ర దొంగల ముఠా అయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.