సార్వత్రిక ఎన్నికల వేళ (Lok Sabha Elections) రకరకాలైన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది.
త్వరలో దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇదే అదునుగా కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. తాజాగా ఎన్నికల సంఘం స్పందించింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోన్న ప్రకటన నకిలీదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటుచేసి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తామని తెలిపింది. ఈ ఫేక్ మెసేజ్‌ను వేరొకరికి పంపే ముందు ధ్రువీకరించుకోవాలని సూచిస్తూ #VerifyBeforeYouAmplify హ్యాష్‌ట్యాగ్‌తో ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేసింది.
మార్చి 12 నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ఎన్నికల సంఘం పేరిట ఓ నకిలీ లేఖను కొందరు వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. మార్చి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ, ఏప్రిల్ 19న పోలింగ్, మే 22న ఓట్ల లెక్కింపు, మే 30 నాటికి ప్రభుత్వ ఏర్పాటు అంటూ పేర్కొనబడింది.
వాస్తవానికి అసెంబ్లీ/లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు వెల్లడిస్తుంటారు. ఎన్నికల తేదీలు, ఓట్ల లెక్కింపు, ఏయే రాష్ట్రాల్లో ఏ తేదీన ఎన్నికలు జరుగుతాయి? ఎన్ని విడతల్లో పోలింగ్ ఉంటుంది? నామినేషన్ల ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది? మొత్తం ఓటర్లు ఎంతమంది? పోలింగ్ ఏర్పాట్లు, సిబ్బంది.. ఇలా అన్ని వివరాలనూ మీడియాకు తెలియజేస్తుంటారు కానీ అంతకంటే ముందే సామాజిక మాధ్యమాల్లో ఫేక్ వార్తలు చక్కర్లు కొట్టేస్తున్నాయి. ఈ వార్తలు నమ్మొద్దని ఈసీ కోరింది.
ఇదిలా ఉంటే ఏప్రిల్- మే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తోంది. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. ఎన్నికల సమరానికి అస్త్రాలను సిద్ధం చేసుకొంటున్న రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టగా.. అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. 195మందితో బీజేపీ తొలి జాబితా విడుదల చేయగా.. కాంగ్రెస్ 36 మందితో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. రాహుల్ గాంధీ తిరిగి వయనాడ్ నుంచే పోటీ చేస్తున్నారు. తెలంగాణ నుంచి నలుగురి పేర్లను వెల్లడించింది.
A fake message is being shared on Whats app regarding schedule for #LokSabhaElections2024#FactCheck: The message is #Fake. No dates have been announced so far by #ECI.
Election Schedule is announced by the Commission through a press conference. #VerifyBeforeYouAmplify pic.twitter.com/DAZlNFOF5W
— Election Commission of India (@ECISVEEP) March 8, 2024