ఉక్రెయిన్ తన సుదీర్ఘ ఆకాంక్షను నెరవేర్చుకొనే క్రమంలో మొదటి అడుగు వేసింది. ఐరోపా సమాఖ్య (ఈయూ)లో చేరాలని తహతహలాడుతున్న ఉక్రెయిన్‌కు యూరోపియన్ కమిషన్ శుక్రవారం పచ్చజెండా ఊపింది. ఆ దేశాన్ని సమాఖ్యలో చేర్చుకోవటానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు ఉక్రెయిన్‌కు ఈయూ అభ్యర్థిత్వ హోదా ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే 27 దేశాల ఈయూలో సభ్యత్వం పొందాలంటే కీవ్‌కు చాలా సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఈయూ నిబంధనలకు అనుగుణంగా ఉక్రెయిన్.. తమ దేశంలో ప్రజాసామ్య సంస్థలను బలోపేతం చేయాలి. చట్టాలను పారదర్శకంగా రూపొందించాలి. మానవహక్కులను పాటించాలి. ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు ఈయూ దేశాలకు ధన్యవాదాలు అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు ట్వీట్ చేశారు.
మరోవైపు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమయ్యారు. ఈ ఆకస్మిక పర్యటనలో ఆయన కీవ్ నగరంలో 120 రోజుల వ్యవధిలో పదివేల మంది సైనికులకు శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని ప్రారంభించారు. రష్యాతో యుద్దంలో ఈ కేంద్రం.. సమీకరణాలు మార్చివేస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. యుద్ధం తీవ్రంగా సాగుతున్న ఈ వేళ.. ఉక్రెయిన్ విజయం సాధించేవరకు బ్రిటన్ అండగా ఉంటుందన్న సందేశమివ్వడమే తన పర్యటన ముఖ్య ఉద్దేశమని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. జర్మనీ, ఇటలీ, రొమేనియా, ఫ్రాన్స్ అధినేతలు గురువారం ఉక్రెయిన్‌లో పర్యటించి, ఈయూలో సభ్యత్వం విషయంలో పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఈయూ కమిషన్ సానుకూలంగా స్పందించి, సిఫార్సు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
UNICEF: పిల్లలపై వలస సంక్షోభం.. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇప్పుడే
ఉక్రెయిన్ కీలక నిర్ణయం: రష్యా పౌరుల విషయంలో ఉక్రెయిన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వీసా తీసుకొనే తమ దేశంలో అడుగుపెట్టాలని పేర్కొంది. జులై ఒకటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుందని జెల్‌న్‌స్కీ తెలిపారు. గతంలో ఈ నిబంధన ఉండేది కాదు. రష్యా పౌరులు ఎలాంటి వీసాలు లేకుండానే ఉక్రెయిన్‌ను సందర్శించేవారు. మరోవైపు డాన్‌బాస్ ప్రాంతంలో రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే శుక్రవారం ఉక్రెయిన్ సైన్యం ఒక ప్రకటన చేసింది. నల్లసముద్రంలో స్నేక్ ఐలాండ్ సమీపంలో రష్యా నౌకాదళానికి చెందిన నౌకను ధ్వంసం చేసినట్లు పేర్కొంది.