Etela Rajendar: పేపర్ మాల్ ప్రాక్టీస్‌లో తన ప్రమేయం లేదని పోలీసులు నిర్ధారించుకున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. తన సెల్‌ఫోన్‌కు ప్రశాంత్ అనే వ్యక్తి నుంచి ఫోన్లు వచ్చాయా అని పోలీసులు అడిగారన్నారు. తన ఫోన్‌ను పరిశీలించి ఎటువంటి ఫోన్లు రాలేదని నిర్ధారించుకున్నారన్నారు. 20 ఏళ్లుగా ప్రజా జీవితంలో బాధ్యత కలిగిన నాయకుడిగా ఉన్నానని ఈటల పేర్కొన్నారు.
పిల్లల భవిష్యత్తు కోసం శ్రమించే ప్రధాని మోడీ పార్టీలో ఉన్నానని ఆయన తెలిపారు. పరీక్ష మొదలయ్యాక పేపర్ బయటకు వస్తే దానిని లీకేజీ అనరన్నారు. ప్రగతి భవన్‌లో కూర్చొని కావాలని కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని.. అధికారులను అడ్డుపెట్టుకొని తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. 30 లక్షల మంది నిరుద్యోగులను ఆగం చేసింది కేసీఆరేనని ఈటల విమర్శించారు. అన్ని పేపర్లు లీక్ చేసి వారి జీవితాలను ఆగం చేస్తున్నారన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డబ్బులు పంపిస్తే కేసీఆర్‌కు ముట్టాయని లిక్కర్ కేసులో బయటకు వచ్చిందని ఈటల రాజేందర్ ఆరోపించారు. కేసీఆర్ అక్రమాలు బయటకు రావద్దని మమ్మల్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
Read Also: Minister Niranjan Reddy: జూపల్లి, పొంగులేటిపై మంత్రి నిరంజన్ రెడ్డి మండిపాటు..
2014 కు ముందు అటుకులు బుక్కి ఉద్యమం చేశామని చెప్పిన ఈటల.. ప్రజల కడుపు, నోరు కొట్టి కేసీఆర్ సంపాదిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, నిర్బంధాలకు గురి చేసినా బీజేపీ పోరాడుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు మేం సిద్ధంగా ఉన్నామన్నారు. స్వయంగా ప్రభుత్వమే టీఎస్‌పీఎస్సీ లీకేజీ జరిగిందని ఒప్పుకుందని.. అందులో మా కుట్ర ఏముందో చెప్పాలన్నారు. కేసీఆర్ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ కుట్రలు చేస్తున్నారన్నారు. బీజేపీ నేతలను బదనం చేయాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్నారు.ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, కేసీఆర్‌ను బొందపెడతారని ఆయన అన్నారు.