Joe Root Overtakes Kumar Sangakkara in Tests: టెస్ట్ క్రికెట్‌లో వరుసగా రికార్డులు బ్రేక్ చేస్తున్న ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మరో అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఓవల్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ ఈ రికార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కరను అధిగమించాడు.
ప్రస్తుతం జో రూట్ ఖాతాలో 12,402 పరుగులు ఉన్నాయి. 146వ టెస్ట్‌లో కుమార సంగక్కర రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. సంగక్కర 134 టెస్ట్‌ల్లో 12,400 పరుగులు బాదాడు. రూట్ మరో 83 పరుగులు చేస్తే.. టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్యాటర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం ఐదవ స్థానంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ ఉన్నాడు. కుక్ టెస్ట్‌ల్లో 12,472 పరుగులు చేశాడు. రూట్ ఫామ్ చూస్తుంటే.. త్వరలోనే కుక్ రికార్డు బ్రేక్ అవుతుంది. వచ్చే నెలలో అక్టోబర్‌లో పాకిస్థాన్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: Rishabh Pant: ప్రత్యర్థి టీమ్ మీటింగ్‌లో పంత్.. ప్లాన్స్ అన్నీ వినేశాడుగా! వీడియో వైరల్
అక్టోబర్‌లో పాకిస్థాన్‌తో మూడు టెస్టులు, నవంబర్-డిసెంబర్‌లో న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు ఇంగ్లండ్ ఆడనుంది. ఈ ఆరు టెస్ట్‌ల్లో జో రూట్ రాణిస్తే.. 13 వేల మార్కును అందుకోవడం అతడికి పెద్ద కష్టమేమి కాదు. గత రెండేళ్లుగా రూట్ భీకర ఫామ్ మీదున్న విషయం తెలిసిందే. సెంచరీల మీద సెంచరీలు బాదుతున్నాడు. ఇక టెస్ట్ ఫార్మాట్‌లో అత్యధిక పరుగుల రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (15921) పేరుపై ఉంది. రికీ పాంటింగ్ (13378), జాక్వెస్ కలిస్ (13289), రాహుల్ ద్రవిడ్ (13288), అలిస్టర్ కుక్ (12472) రూట్ కంటే ముందున్నారు.