BRS Formation Day : వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి గ్రామం ఈరోజు గులాబీ వాతావరణంలో నిండిపోయింది. బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను పురస్కరించుకుని భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఈ సభలో బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. సభ కోసం మొత్తం 1213 ఎకరాల్లో ఏర్పాట్లు చేపట్టగా, ఇందులో 159 ఎకరాల్లో సభాప్రాంగణాన్ని, 1000 ఎకరాలకు పైగా పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. బిఆర్ఎస్ కటౌట్లు, ఫ్లెక్సీలు, జెండాలతో వరంగల్ నగరం నుండి ఎల్కతుర్తి వరకు గులాబీమయం అయింది.
సభ వేదిక 500 మంది కూర్చునేలా బాహుబలి స్థాయిలో రూపొందించగా, విద్యుత్ అంతరాయం రాకుండా 200 భారీ జనరేటర్లు సిద్ధం చేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లతో పాటు 10 లక్షల వాటర్ బాటిళ్లు సభకు హాజరయ్యే వారికి అందించనున్నారు. ఇప్పటికే నిన్నటినుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆటో ర్యాలీలు, ఎడ్లబండ్ల ర్యాలీల రూపంలో ప్రజలు భారీగా ఎల్కతుర్తికి తరలివచ్చారు.
బీఆర్ఎస్ సభ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కరీంనగర్ నుంచి హనుమకొండ వైపు వచ్చే వాహనాలు పరకాల క్రాస్ రోడ్, కమలాపూర్ మీదుగా ఓఆర్ఆర్ రూట్ ఉపయోగించాలి. అలాగే హనుమకొండ నుంచి కరీంనగర్ వైపు వెళ్లే వాహనాలు ముచ్చర్ల క్రాస్ నూతన ఓఆర్ఆర్ రోడ్, కమలాపూర్, పరకాల క్రాస్ రోడ్ రూట్లను అనుసరించాలి.
సిద్దిపేట నుంచి హనుమకొండకు వచ్చే వాహనాలు జనగామ, తరిగొప్పుల మీదుగా రూట్ తీసుకోవాలని పోలీసులు సూచించారు. సూచించిన మార్గాల్లో ప్రయాణించి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సహకరించాలని ట్రాఫిక్ అధికారులు విజ్ఞప్తి చేశారు. సభకు హాజరయ్యే వేలాది మందిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 1100 మంది పైగా సిబ్బంది భద్రత కోసం విధులు నిర్వర్తించనున్నారు. వీరిలో ఇద్దరు డీసీపీలు, ఇద్దరు అదనపు డీసీపీలు, 8 మంది ఏసీపీలు, 28 మంది సీఐలు, 66 మంది ఎస్సైలు, 137 మంది ఏఎస్సైలు, 711 మంది కానిస్టేబుళ్లు భాగమయ్యారు. పూర్తి భద్రత చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల సౌకర్యం కోసం పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. సభ విజయవంతం చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?