Coco Gauff Out From US Open 2024: యుఎస్ ఓపెన్ 2024 నుంచి టాప్ సీడెడ్ల నిష్క్రమణ కొనసాగుతూనే ఉంది. పురుషుల టైటిల్ ఫెవరెట్స్ నొవాక్ జకోవిచ్, కార్లోస్ అల్‌కరాజ్ ఇప్పటికే ఇంటిదారి పట్టగా.. తాజాగా మహిళల డిఫెండింగ్ ఛాంపియన్ కొకో గాఫ్ కథ కూడా ముగిసింది. గాఫ్‌కు అమెరికాకే చెందిన 13వ సీడ్ ఎమ్మా నవారో ప్రిక్వార్టర్స్‌లో షాకిచ్చింది. నాలుగో రౌండ్లో 6-3, 4-6, 6-3తో గాఫ్‌ను నవారో ఓడించింది. 60 అనవసర తప్పిదాలు చేసిన గాఫ్ మూల్యం చెల్లించుకుంది. నవారోకు యుఎస్ ఓపెన్ క్వార్టర్స్ చేరడం ఇదే తొలిసారి.
రెండో సీడ్ అరీనా సబలెంక (బెలారస్) క్వార్టర్స్‌లో ప్రవేశించింది. నాలుగో రౌండ్లో 6-2, 6-4తో మెర్టెన్స్ (బెల్జియం)ను సునాయాసంగా ఓడించింది. ఏడో సీడ్ జెంగ్ (చైనా) కూడా క్వార్టర్స్‌లో చోటు దక్కించుకుంది. ప్రిక్వార్టర్స్‌లో 7-6 (7-2), 4-6, 6-2తో వెకిచ్ (క్రొయేషియా)ను మట్టికరిపించింది. ముచోవా (చెక్) 6-3, 6-3తో పావోలిని (ఇటలీ)పై, ఆరో సీడ్ పెగులా (అమెరికా) 6-4, 6-2తో ష్నైదర్ (రష్యా)పై గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.
ఫ్రాన్సిన్ తియోఫె (అమెరికా) యుఎస్ ఓపెన్ క్వార్టర్‌పైనల్లో అడుగుపెట్టాడు. నాలుగో రౌండ్లో 6-4, 7-6 (7-3), 2-6, 6-3తో అలెక్సీ పాపిరిన్ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. జ్వెరెవ్ (జర్మనీ) 3-6, 6-1, 6-2, 6-2తో నకషిమ (అమెరికా)ను మట్టికరిపించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. దిమిత్రోవ్ (బల్గేరియా) 6-3, 7-6 (7-3), 1-6, 3-6, 6-3తో రుబ్లెవ్ (రష్యా)ను ఓడించాడు. ఫ్రిట్జ్ 3-6, 6-4, 6-3, 6-2తో రూడ్ (నార్వే)ను ఓడించాడు.