వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా, భద్రతా పరంగా విద్యుత్ శాఖ చేపట్టిన పనులను చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రఘుమా రెడ్డి సమీక్షించారు. సెప్టెంబర్ 18 నుండి ప్రారంభమయ్యే గణేష్ పండుగ ఉత్సవాలు 11 రోజుల పాటు నిర్వహిస్తారు. మండపాలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా మరియు భద్రతా కోసం తమ సంస్థ తగు ఏర్పాట్లు చేసిందన్నారు. సామాన్య ప్రజలు, భక్తులు మరియు మండప నిర్వాహకులు మండపాల వద్ద విద్యుత్ భద్రతా చర్యలు పాటించాలని కోరారు.
గణేష్ మండపాల వద్ద పాటించాల్సిన విద్యుత్ భద్రతా జాగ్రత్తలు:
1. మండపాలకు విద్యుత్ సరఫరా కనెక్షన్ కోసం సామాన్యులు స్తంభాలు ఎక్కరాదు. సంస్థ సిబ్బంది ద్వారానే విద్యుత్ కనెక్షన్ పొందగలరు.
2. ISI మార్క్ కలిగిన ప్రామాణిక విద్యుత్ వైర్లను మాత్రమే వాడాలి. ఎలాంటి జాయింట్ వైర్లు వాడరాదు.
3. తగినంత కెపాసిటీ కలిగిన MCB తప్పనిసరిగా వాడాలి. ఇది విద్యుత్ ప్రమాదాల నుండి రక్షణ ఇస్తుంది.
4. మండపాల్లో విద్యుత్ సంబంధిత పనులు చేసేటప్పుడు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. విద్యుత్ వైర్ల/ పోల్స్, ఇతర ప్రమాదకర విద్యుత్ పరికరాల నుండి పిల్లల్ని దూరంగా ఉంచండి.
5. ఒక వేళ ఎవరికైనా విద్యుత్ షాక్ తగిలితే వారికి వెంటనే వైద్య సహాయం అందించి, ఆ ప్రమాదం గురించి దగ్గరలోని విద్యుత్ సిబ్బందికి తెలియజేయగలరు.
6. విద్యుత్ వైరింగ్ లో ఎక్కడైనా లీకేజ్ ఉంటే, వర్షాలు కురిసినప్పుడు తేమ వలన షాక్ కలిగే అవకాశమున్నది. కనుక మండప నిర్వాహకులు ప్రతి రోజు తప్పనిసరిగా వైరింగ్ ను క్షుణ్ణంగా పరిశీలించాలి.
7. విద్యుత్ లైన్స్ ఎక్కడైనా తెగి పడ్డా, మరియు ఇతర అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు వెంటనే 1912 / 100 / సమీప ఫ్యుజ్ ఆఫ్ కాల్ కు కాల్ చేసి విద్యుత్ సిబ్బందికి తెలియజేయగలరు.
విద్యుత్ వినియోగదారులకు, సామాన్య ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ రఘుమా రెడ్డి, స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ పండుగను సుఖసంతోషాలతో సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.