Elections : ఎన్నికల వేళ తరచూ వినబడే పదాల్లో డిపాజిట్ పదం ఒకటి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యర్థులను విమర్శించే క్రమంలో డిపాజిట్ కూడా రాదని తరచూ అంటుంటారు. అసలు డిపాజిట్ అంటే.. ఓ అభ్యర్థికి నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లలో ఆరో వంతు ఓట్లు రావస్తే ఆయనకు డిపాజిట్ వచ్చినట్లుగా పరిగణిస్తారు. ఒక వేళ అలా రాకపోతే డిపాజిట్ గల్లంతైనట్లే. కాని 1952లో జరిగిన ఎన్నికల్లో వినూత్న ఘటన చోటు చేసుకుంది. డిపాజిట్ రాకపోయినా ఓ అభ్యర్థికి ఎమ్మెల్యేగా నెగ్గారు. వివరాల్లోకి వెళితే..
READ MORE: Congress vs Left: రాహుల్ గాంధీకి డీఎన్ఏ టెస్ట్ చేయాలి.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
అది 1952. అప్పటికి ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుంచి విడిపోలేదు. మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా పరవాడ నియోజకవర్గం నుంచి తొమ్మిది మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఆ నియోజకవర్గంలో అప్పుడు కేవలం 60,780 ఓట్లు మాత్రమే ఉండేవి. ఎన్నికల్లో 25,511 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఎన్నికల మీద సరైన అవగాహన లేకపోవడంతో పోలింగ్ పై జనాలు మక్కువ చూపించలేదు. సీపీఐ అభ్యర్థి ముళ్లపుడి వీరభద్రానికి 7,064 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి జగన్నాథరాజుకు 4,347 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఎల్ జీఏ రావుకు 3,109 ఓట్లు, కృషికార్ లోక్ పార్టీ అభ్యర్థి ఈటి నాగయ్యకు 1,158 ఓట్లు వచ్చాయి. అప్పటి ఎన్నికల నిబంధనల విధానం ప్రకారం.. అభ్యర్థికి డిపాజిట్ దక్కాలంటే పోలైన ఓట్లలో మూడో వంతు ఓట్లు వచ్చి ఉండాలి. అంటే 8,504 ఓట్లు రావాలన్నమాట. కాని ఎవ్వరికీ అన్ని ఓట్లు రాకపోవడంతో అధికారులు తలలు పట్టుకున్నారు.
విజేతను తేల్చేందుకు నిరాకరించారు. ప్రత్యర్థిపై ఒక్క ఓటు అధికంగా వచ్చిన వారే విజేత అని కమ్యూనిస్టులు పట్టుపట్టడంతో ఎన్నికల సంఘం దిగి వచ్చింది. ఉన్నతాధికారులు వీరభద్రంను విజేతగా ప్రకటించారు. దీంతొ మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. 1955లో జరిగిన ఎన్నికల్లో డిపాజిట్ విధానాన్ని మార్చేశారు. పోలైన ఓట్లలో ఆరోవంతు మాత్రమే వస్తే చాలని కొత్త నిబంధనను ప్రవేశ పెట్టారు.