కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి షాకిచ్చింది. ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం 48 గంటల నిషేధం విధించింది. ఓటు వేయకపోతే పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలు ఆపేస్తామని వివాదాస్పద ప్రసంగం చేశారని మంత్రి జగదీష్ రెడ్డిపై ఫిర్యాదులు అందాయి. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని నిర్ధారించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులు జారీచేసింది. ఓటర్లను బెదిరించే విధంగా ప్రసంగాలు చేశారన్న ఈసీ.. ఆయనపై నిషేధం విధించింది.
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఈనెల 25వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వచ్చాయి. ఈనెల 29 సాయంత్రం 3 గంటల వరకు నోటీసులకు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది ఈసీ. కారు గుర్తుకు ఓటేయకుంటే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామన్నారు మంత్రి జగదీష్ రెడ్డి… ఈ వ్యాఖ్యలపై సీఈఓకు ఫిర్యాదు చేశారు కపిలవాయి దిలీప్ కుమార్.. జిల్లా ఎన్నికల అధికారి ఇచ్చిన రిపోర్టు ఆధారంగా మంత్రికి నోటీసులు ఇచ్చింది ఈసీ. ఇవాళ మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించింది.
ఒక మంత్రిగా ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఎన్నికల నియమాలు ఉల్లంఘించారు.. ఆర్టికల్ 324 కింద సంక్రమించిన అధికారాలతో ఆయన ఎన్నికల ప్రచారంపై నిషేధం విధిస్తున్నాం.. ఈ నిషేధం ఈరోజు రాత్రి 7 గంటల నుంచి అమల్లోకి వస్తుందని ఈసీ పేర్కొంది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించే బాధ్యతను మంత్రి జగదీష్ రెడ్డి తన నెత్తిమీద వేసుకున్నారు. గత కొన్ని రోజులుగా మునుగోడు నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రచారం బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. అన్నీ తానే అయి దూసుకుపోతున్నారు.
Read Also: Raghuram passes away: సినీ ఇండస్ట్రీకి షాక్.. కామెర్ల వ్యాధితో యువ సంగీత దర్శకుడు మృతి
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ తరపున మునుగోడు ఉప ఎన్నికకే ఇంచార్జుగా వ్యవహరిస్తున్నారు జగదీష్ రెడ్డి. కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేయడం, నిషేధం విధించడంతో జగదీష్ రెడ్డి షాకయ్యారు. ఇది పార్టీకి, జగదీష్ రెడ్డి అనుచరులకు ప్రతికూల అంశంగానే భావించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి తప్పు చేశారని, ఓటర్లను బెదిరించినందునే ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులు జారీ చేసిందని, ఎన్నికల ప్రచారంపై నిషేధపు ఉత్తర్వులు ఇచ్చిందని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే, ఈసీ తీసుకున్న చర్యలపై టీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. బీజేపీకి అనుకూలంగా ఈసీ నిర్ణయం తీసుకుందని ఆపార్టీ విమర్శిస్తోంది.
Read Also: Babloo Prithiveeraj: మేము పెళ్లి చేసుకోలేదు.. బాంబ్ పేల్చిన పృథ్వీ