ఆడవారిలో ఆరోగ్యకరమైన గర్భధారణకు గుడ్డు నాణ్యత (Egg Quality) అత్యంత కీలకం. సరైన నాణ్యత గల అండాలు ఉంటేనే, పిండం ఆరోగ్యంగా అభివృద్ధి చెంది, ఇంప్లాంటేషన్ సమస్యలు, గర్భస్రావాల ముప్పు తగ్గుతుంది. అయితే, 35 సంవత్సరాల తర్వాత గర్భం దాల్చే అవకాశాలు తగ్గడం, సరిలేని జీవనశైలి కారణంగా సంతానోత్పత్తిపై ప్రభావం పడుతున్న ఈ రోజుల్లో.. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా సహజంగానే అండాల నాణ్యతను పెంచుకునే అవకాశం ఉందని డాక్టర్‌లు సూచిస్తున్నారు.
పెళ్లయ్యాక త్వరగా పిల్లలు కావాలంటే భార్యాభర్తలిద్దరి ఆరోగ్యం మెరుగ్గా ఉండాలి. ఒత్తిడి లేని లైఫ్, భార్యాభర్తల మధ్య అన్యోన్యతతో పాటు, సరైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. మగవారిలో స్పెర్మ్ నాణ్యత పెంచడంలోనూ, ఆడవారిలో అండాల నాణ్యత సరిగ్గా ఉండేందుకు ఈ ఆహారాలు ఎంతో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
గుడ్డు నాణ్యత పెంచే అద్భుతమైన డ్రై ఫ్రూట్స్
1. వాల్‌నట్స్ (ఆక్రోట్స్)
వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. ఓవరీస్‌లో రక్త ప్రసరణను (Blood Flow) మెరుగుపరుస్తాయి. అండ కణాలను డ్యామేజ్ కాకుండా కాపాడి, హార్మోన్ బ్యాలెన్స్‌కి సహాయపడతాయి.
2. ఆల్మండ్స్ (బాదం)
వీటిలోని విటమిన్ ఈ, హెల్దీ ఫ్యాట్స్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్ అండాలను డ్యామేజి కాకుండా రక్షిస్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గించి, మంచి గుడ్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. సూచన: రోజుకు 10 నుంచి 15 నానబెట్టిన బాదం తీసుకుంటే మంచిది. (గాల్ స్టోన్ సమస్య ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవాలి).
సీడ్స్ & సూపర్ ఫుడ్స్: హార్మోన్ బ్యాలెన్స్‌కి మేలు
1. అవిసెలు (Flax Seeds)
వీటిలోని ఒమేగా 3 కంటెంట్ అండాల నాణ్యతకు తోడ్పడుతుంది. లిగ్నాన్స్, ఫైబర్ హార్మోన్స్‌ను బ్యాలెన్స్ చేసి మెనుస్ట్రువల్ సైకిల్‌ను రెగ్యులర్ చేస్తాయి. ఐవీఎఫ్ (IVF) వంటి చికిత్స తీసుకునేవారికి ఇవి చాలా మంచివి.
2. చియా గింజలు (Chia Seeds)
మంచి ప్లాంట్ బేస్డ్ ఒమేగా 3, ఫైబర్, మినరల్స్‌ను అందిస్తాయి. ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేయడం ద్వారా రీప్రోడక్టివ్ హెల్త్‌ను మెరుగుపరుస్తాయి.
శక్తివంతమైన పండ్లు, గుడ్లు, ఆకుకూరలు
1. అవకాడో
మోనోశాచ్యురేటెడ్ ఫ్యాట్స్, విటమిన్ ఇ, ఫోలేట్ వంటి పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా హార్మోన్స్ రెగ్యులేట్ అయ్యి, ప్రత్యుత్పత్తి అవయవాలకు రక్త ప్రసరణ పెరిగి, అండాల అభివృద్ధికి తోడ్పడుతుంది.
2. గుడ్లు (Eggs)
గుడ్లను సూపర్‌ఫుడ్ అని పిలవడానికి కారణం, వీటిలో ఉండే ఎసెన్షియల్ విటమిన్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ప్రత్యుత్పత్తి వ్యవస్థకి ఎంతో మేలు చేస్తాయి.
3. పాలకూర & బ్రకోలీ
ఈ రెండింటిలోనూ ఫోలేట్ (Folate), ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్ ఎ, సి, ఈ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఓవులేషన్‌ను పెంచి, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని తగ్గించడం ద్వారా అండాల అభివృద్ధికి, సంతానోత్పత్తి అవకాశాల పెరుగుదలకు సహాయపడతాయి.
రిలాక్సేషన్‌కు, ఆరోగ్యాన్ని మెరుగుపరిచేవి
1. బెర్రీస్ (స్ట్రాబెర్రీస్, బ్లూ బెర్రీస్, రాస్ప్‌బెర్రీస్)
వీటిలోని అధిక యాంటీ ఆక్సిడెంట్లు అండాల నాణ్యతను మెరుగుపరుస్తాయి. ఫైబర్ మరియు ఫోలేట్ ఓవులేషన్‌ను రెగ్యులేట్ చేయడంలో సహాయపడతాయి.
2. డార్క్ చాక్లెట్ (మితంగా)
మితంగా తీసుకునే డార్క్ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, రీప్రోడక్టివ్ ఆర్గాన్స్‌ను ఇంప్రూవ్ చేస్తాయి.ఇందులోని మెగ్నీషియం, జింక్ మినరల్స్ గుడ్డు నాణ్యతని మెరుగ్గా చేస్తాయి.
ముఖ్య గమనిక: ఇవి అధ్యయనాలు మరియు నిపుణుల సలహాల ప్రకారం అందించిన వివరాలు మాత్రమే. ప్రతి ఒక్కరి ఆరోగ్యం, శరీర తత్వాన్ని బట్టి ఫలితాలు మారవచ్చు. ఈ ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకునే ముందు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఆరోగ్యకరమైన జీవనశైలి, ఒత్తిడి లేని వాతావరణం కూడా సంతానోత్పత్తికి చాలా ముఖ్యం.