తమిళనాడులో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యూహరచన చేస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న బీజేపీ.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే పక్కాగా స్కెచ్ వేస్తోంది. ఈ క్రమంలో అన్నాడీఎంకేతో మరోసారి పొత్తుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి కలిసి సుముఖత తెలిపారు. అయితే బీజేపీతో పొత్తుకు షరతులు విధించారు.
Also Read: One Nation One Election: 2029 తర్వాతే జమిలి ఎన్నికలు: నిర్మలా సీతారామన్
బీజేపీ చీఫ్ అన్నామలైని మార్చాలని ఎడప్పాడి పళనిస్వామి పట్టుపట్టారు. ఇప్పటికే అన్నామలై రాజీనామా చేశారు. మరో 2-3 రోజుల్లో కొత్త అధ్యక్ష ఎన్నిక జరగనుంది. ఈరోజు రామేశ్వరం పర్యటన అనంతరం ప్రధాని మోడీతో ఈపీఎస్ (ఎడప్పాడి పళనిస్వామి), మాజీ సీఎం పన్నీర్ సెల్వం వేర్వేరుగా భేటీ కానున్నారు. మదురై ఎయిర్‌పోర్ట్‌లో ఈ భేటీ జరగనుంది. ఇప్పటికే బీజేపీ అలయెన్స్‌లో శశికళ మేనల్లుడు, అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం అధ్యక్షులు టీటీవీ దినకరన్ కొనసాగుతున్నారు. ఈ ముగ్గురితో కలిసి కూటమి ఏర్పాటు దిశగా బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. డీఎంకేపై వ్యతిరేకత, సంప్రదాయ ఓటు బ్యాంకుతో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంది.