ED officials: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇంటికి ఈడీ అధికారులు వెళ్లారు. రాంచీలోని భూ కుంభకోణం కేసులో ఈడీ బృందం సీఎంను ప్రత్యేక గదిలో విచారిస్తోంది. దీంతో విషయం తెలిసిన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం నివాసానికి భారీగా తరలి వస్తున్నారు. దీంతో జేఎంఎం కార్యకర్తలు సీఎం నివాసం వెలుపల కంకే రోడ్డును దిగ్బంధించి ఈడీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మరోవైపు, సీఎం హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తుండటో ఎలాంటి సమస్యలు రాకుండా.. ముఖ్యమంత్రి నివాసం చుట్టూ భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ ప్రశ్నోత్తరాల కంటే ముందు జమ్‌తారా ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ ముఖ్యమంత్రిని కలుసుకున్నారు.. ఆయనను కలిసిన తర్వాత భావోద్వేగానికి గురయ్యారు. సీఎంని కౌగిలించుకుని ఏడ్చారు. ఇక, సీఎం సోరెన్ ఇంటి దగ్గర జేఎంఎం పార్టీ కార్యకర్తలు ఈడీ చర్యకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా, భద్రతా ఏర్పాట్లను నిర్వహించడానికి రాంచీ ఎస్‌ఎస్‌పీ చందన్ కుమార్ సిన్హా క్యూఆర్‌టీతో సీఎం నివాసం ముందు గస్తీ కాస్తున్నారు. ఇక, రాష్ట్ర మంత్రులు జోబా మాంఝీ, చంపాయ్ సోరెన్‌తో పాటు అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు సీఎం నివాసానికి చేరుకుంటున్నారు. రాంచీ పోలీసు అడ్మినిస్ట్రేషన్‌లోని సీనియర్ అధికారులు సీఎం నివాసం సమీపంలోని గేటు దగ్గర నిలిపివేశారు.