GVL Narasimha Rao: సముద్రాన్ని నిర్లక్ష్యం చేస్తే విశాఖ వాసుల గొంతు కోసినట్లే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు మేల్కోవాలని సూచించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విశాఖ అంటే ముందుగా గుర్తొచ్చేది సముద్రం.. విశాఖపట్నం ఆర్థిక వ్యవస్థకు మూలం సముద్రం.. కానీ, రాష్ట్ర ప్రభుత్వం విశాఖ లోని సముద్రతీరాలు పట్ల నిర్లక్ష్యం వహించడం బాధాకరం అన్నారు. నగరంలోని వ్యర్ధాలు డ్రైనేజీ ద్వారా నేరుగా వచ్చి సముద్రంలో కలుస్తున్నాయి. విశాఖ లోని సముద్ర తీర ప్రాంతం వ్యర్ధాలతో పూర్తిగా నిండిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖలో పర్యాటక రంగాన్ని 10 రెట్లు పెంచొచ్చు.. కానీ, ఇటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం శోచనీయం అన్నారు. కాలుష్యం కారణంగా 30 సంవత్సరాల వ్యవధిలో 3.4 కిలోమీటర్ల సముద్ర తీరం కుదించుకుపోయింది. విశాఖలో సుమారు రెండు లక్షల మంది మత్స్యకారులు సముద్రంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సముద్ర తీరాన్ని నిర్లక్ష్యం చేస్తే విశాఖ భవిష్యత్తును నిర్లక్ష్యం చేసినట్లే అవుతుందన్నారు. తక్షణమే వ్యర్ధాలు సముద్రంలో కలవకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు.