లిక్కర్ స్కామ్ కేసులో (liquor Police case) వరుసగా ఐదుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ (Arvind kejriwal) విచారణకు డుమ్మాకొట్టారు. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) కోర్టును ఆశ్రయించింది. ఈడీ సమన్లకు ముఖ్యమంత్రి స్పందించడం లేదని.. విచారణకు హాజరుకావడం లేదని ఈడీ పిటిషన్‌లో పేర్కొంది. ఈడీ పిటిషన్‌ను ఢిల్లీలోని (Delhi) రూస్ అవెన్యూ కోర్టు వచ్చే బుధవారం విచారించనుంది.
లిక్కర్ స్కామ్‌లో గతంలో నాలుగు సార్లు కేజ్రీవాల్‌కు నోటీసులు ఇచ్చింది. గత నవంబర్ 2న, ఆ తర్వాత డిసెంబర్ 21, జనవరి 3, జనవరి 13న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు ఇచ్చింది. ఐదోసారి జనవరి నెలాఖరున నోటీసు ఇచ్చి శుక్రవారం (ఫిబ్రవరి 2)న విచారణకు హాజరుకావాలని నోటీసులు పేర్కొంది. కానీ ఐదోసారి కూడా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించారు.
మద్యం పాలసీ కేసులో ఆప్ ముఖ్య నేతలు ఎంపీ సంజయ్‌సింగ్, మాజీ మంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. గతేడాది ఫిబ్రవరిలో సిసోడియా, అక్టోబర్‌లో సంజయ్‌సింగ్ అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. పలుమార్లు బెయిల్ పిటిషన్లు కూడా రద్దు కావడంతో ఇంకా తీహార్ జైల్లోనే మగ్గుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ వెంటాడుతోంది. త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఆ లోపు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను అరెస్ట్ చేసినట్లుగా కేజ్రీవాల్‌ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా బీజేపీపై చేసిన ఆరోపణలకు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇచ్చిన నోటీసును కూడా కేజ్రీవాల్ తిరస్కరించారు. దీంతో బీజేపీ ధ్వజమెత్తింది. విచారణ నుంచి తప్పించుకునేందుకు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ మండిపడింది.