E20 Fuel Policy: భారతదేశంలో గత కొద్దీ రోజులుగా E20 ఫ్యూయల్ (20% ఎథనాల్ మిశ్రమం ఉన్న పెట్రోల్)పై చర్చ తీవ్రతరమైంది. సోషల్ మీడియాలో అనేకమంది కారు వినియోగదారులు తమ వాహనాల్లో మైలేజ్ గణనీయంగా తగ్గిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు, సస్టెయినబిలిటీ లక్ష్యాలను చేరుకోవడానికై కేంద్ర ప్రభుత్వం 2023 ఏప్రిల్‌లో E20 ఫ్యూయల్‌ను ప్రవేశపెట్టింది. కానీ, పాత వాహనాలు ఈ ఫ్యూయల్‌కి అనుకూలం కాకపోవడంతో కొన్ని కార్ల వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంశాన్ని సుప్రీంకోర్టులోకి తీసుకెళ్లుతూ అడ్వకేట్ అక్షయ్ మల్హోత్రా ఇటీవల ప్రజాహిత వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సెప్టెంబర్ 1, 2025న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయ్, న్యాయమూర్తులు కె. వినోద్ చంద్రన్, ఎన్.వి. అంజారియాలతో కూడిన బెంచ్ విచారించనుంది. ఇందులో ప్రధానంగా వినియోగదారులకు E0 పెట్రోల్ (ఎథనాల్ లేని పెట్రోల్) ఎంపికగా అందుబాటులో ఉండాలన్న డిమాండ్ ఉంది. అంతేకాకుండా, ఇంధన స్టేషన్లలో ఎథనాల్ శాతం స్పష్టంగా లేబుల్ చేయాలని పిటిషన్ కోరుతోంది.
RIL Jio Frames: HD కెమెరా, లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్లతో రిలయన్స్ జియోఫ్రేమ్స్
E20 వివాదం తీవ్రతరమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనేక ట్వీట్లు, ప్రకటనల ద్వారా తన వైఖరిని తెలిపింది. పెట్రోలియం అండ్ సహజవాయు మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో తెలిపినదాని ప్రకారం ఎథనాల్ ఎనర్జీ డెన్సిటీ పెట్రోల్ కంటే తక్కువగా ఉండటంతో, మైలేజ్‌లో చాలా స్వల్పమైన తగ్గుదల ఉంటుందని. E10 కోసం డిజైన్ చేసి E20కి కాలిబ్రేట్ చేసిన నాలుగు చక్రాల వాహనాల్లో సుమారు 1-2% వరకు తగ్గుదల ఉండవచ్చని తెలిపింది. ఇతర వాహనాల్లో ఇది 3-6% వరకు ఉండొచ్చని పేర్కొంది. అయితే, ఇంజిన్ ట్యూనింగ్ మెరుగుపరిస్తే ఈ ప్రభావాన్ని తగ్గించవచ్చని.. ఇప్పటికే అనేక ఆటోమొబైల్ కంపెనీలు E20 కంపాటిబుల్ మెటీరియల్స్ ఉపయోగిస్తున్నాయని పేర్కొంది.
మరో విషయానికి వస్తే.. E20 వాడితే వాహన ఇన్సూరెన్స్ రద్దవుతుందని వచ్చిన వార్తలను ప్రభుత్వం పూర్తిగా ఖండించింది. ఇన్సూరెన్స్ పాలసీ అమలులో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. అంతేకాదు, భారత్ 2026 అక్టోబర్ వరకు E20 కంటే ఎక్కువ మిశ్రమానికి వెళ్లదని.. ఆ తర్వాత మాత్రం అధిక మిశ్రమం తప్పనిసరిగా అమల్లోకి వస్తుందని పేర్కొంది.