రవీంద్రభారతిలో దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, హాజరైన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలి స్పీకర్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్రపటానికి నివాళులు అర్పించారు సీఎం, మంత్రులు. రవీంద్రభారతి ఆవరణలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. మా తండ్రి జయంతి ఉత్సవాలను ప్రభుత్వం తరపున జరుపుతున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి స్పూర్తిదాయకమైన పీవి నర్సింహ రావు కు ప్రధాన శిష్యుడుగా ఉన్నారన్నారు. ప్రజల కోసం సేవ చేస్తూ మా నాన్న గారు ప్రాణాలు కోల్పోయారని, మా తండ్రి ఆశయాలకు నెరవేర్చేందుకు నేను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన తెలిపారు.
అనంతరం.. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. దుద్దిళ్ల శ్రీపాదరావు గ్రామ సర్పంచ్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజలకు ఎంతో సేవ చేశారన్నారు. శ్రీపాద రావు ఆశిష్యులతో నేను విద్యార్థి నాయకునిగా ఎదిగానని, ఉమ్మడి రాష్ట్రంలో మచ్చలేని నాయకునిగా ఉన్నారన్నారు. అలాంటి నాయకున్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు మంత్రి పొన్నం. శ్రీపాద రావు కు జయంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పిస్తున్నానన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీపాద రావు తో చట్ట సభల్లో పాల్గొన్నానని తెలిపారు. ఆయన కుమారుడు శ్రీధర్ బాబు తో చట్ట సభల్లో పాల్గొన్నానని, ఇద్దరితో చట్ట సభల్లో పాల్గొన్న ఏకైక వ్యక్తిని నేనని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన అజాత శత్రువు అని, ముఖ్యమంత్రిగా కావాల్సిన వ్యక్తి శ్రీపాద రావు అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పేద ప్రజల పక్షపాతి శ్రీపాద రావు అని కొనియాడారు. తీవ్ర వాదుల ప్రభావం ఉన్న మంథని ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నం చేశారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అండగా నిలుస్తున్న వ్యక్తి శ్రీపాద రావు కొడుకు శ్రీధర్ బాబు అన్నారు. తండ్రికి తగ్గ తనయుడు శ్రీధర్ బాబు అని, తండ్రిని మించిన తనయుడు కావాలని కోరుకుంటున్నానన్నారు. శ్రీపాద రావు విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాని ఆయన అన్నారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. శ్రీపాద రావు జీవితం నేటి తరానికి ఆదర్శమన్నారు. స్పీకర్ గా అసెంబ్లీని నడిపించిన తీరు ఇప్పటికి అందరికి గుర్తుంటదని, తీవ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. శ్రీపాద రావు జయంతి ఉత్సవాలను ప్రభుత్వం తరుపున నిర్వహించడం సంతోషకరమన్నారు. శ్రీపాద రావు మన మధ్య లేకపోయినా ఆయన కుమారుడు శ్రీధర్ బాబు రూపంలో ప్రజలు చూసుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి తర్వాత ఆయన కుమారుడు శ్రీధర్ బాబు పాత్ర ప్రభుత్వంలో ముఖ్యంగా ఉందన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ.. శ్రీపాద రావు జయంతి ఉత్సవాలను ప్రభుత్వం తరుపున జరుపుకోవడం సంతోషకరమన్నారు. ఆయన మార్గం లో అందరూ నడుచుకోవాలన్నారు. ఆయన శాసన సభ ను విజయవంతంగా నడిపించారన్నారు. తరువాత.. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీపాద రావు సర్పంచ్ నుండి, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గొప్ప వ్యక్తి అన్నారు.
ఆయన స్పీకర్ గా నడిపిన తీరు మీద పుస్తకాన్ని రూపొందించారన్నారు. ఆయన పుస్తకాలని శాసన సభలో అందరూ సభ్యులకు అందజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరుతున్నానని, రాష్ట్ర ప్రజలకోసం ఆయన ప్రాణాలు అర్పించారన్నారు. సభను ముందుకు తీసుక పోయే శక్తి యుక్తులు ఆయన తర్వాత కుమారుడు శ్రీధర్ బాబు కు కూడా ఉన్నవన్నారు.