వరి సాగుపై సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామా రెడ్డి ఇటీవల వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వరి వేస్తే ఉరేనని… వరి విత్తనాలు అమ్మితే… ఫర్టిలైజర్ షాపులపై చర్యలు తప్పవని సినిమా రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారు సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామారెడ్డి. అయితే..కలెక్టర్ వెంకట్రామారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. అటు ప్రతి పక్ష కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి.
ఈ నేపథ్యంలోనే… సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామారెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ… కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చింది బీజేపీ పార్టీ. ఈ రోజు 12 గంటలకు సిద్దిపేట కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చింది సిద్దిపేట జిల్లా బీజేపీ. ఈ తరుణంలోనే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును గృహ నిర్బంధం చేశారు పోలీసులు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి లో నివాసం ఉంటున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును హౌస్ అరెస్ట్ చేశారు. అటు కలెక్టరేట్ ముట్టడి కి వెళ్లకుండా జిల్లాలో బీజేపీ నాయకులను కూడా ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు పోలీసులు.