పౌరసరఫరాల సంస్థలో శాశ్వత ప్రతిపాదికలో పనిచేసే ఉద్యోగుల గ్రూప్ మెడికల్ క్లెయిమ్ రూ.3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడం జరిగిందని పౌరసరఫరాల శాఖకమిషనర్ డీఎస్ చౌహాన్ వెల్లడించారు. మెడికల్ క్లెయిమ్ ధరలను నిర్ణయించడానికి జనరల్ మేనేజర్ (ప్రొక్యూర్‌మెంట్), జనరల్ మేనేజర్ (మార్కెటింగ్), జనరల్ మేనేజర్ (ఫైనాన్స్), డిప్యూటి జనరల్ మేనేజర్ (అడ్మిన్)తో ఒక కమిటీని వేయడం జరిగింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వరంగ సంస్థల నుంచి సీల్డ్ కొటేషన్స్‌ను ఆహ్వానించడం జరిగింది. మంగళవారం నాడు పౌరసరఫరాల భవన్‌లో కమిషనర్ డీఎస్ చౌహాన్ సమక్షంలో కమిటీ సభ్యులు, ప్రభుత్వరంగ సంస్థల ప్రతినిధుల ఆధ్వర్యంలో సీల్డ్ కొటేషన్స్‌ను తెరవడం జరిగింది. న్యూ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీకి అందరికంటే తక్కువగా కోట్ చేసింది.
ఇదిలా ఉంటే.. ఈ నెల 31వ తేదీలోగా మిల్లర్లు ఎఫ్‌సీఐకి మొత్తం కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) ఇవ్వాలని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఆదేశించారు. ఆలస్యం చేస్తామంటే కుదరదని, డిఫాల్ట్ అయిన మిల్లర్ల నుంచి 25 శాతం పెనాల్టీ వసూలు చేస్తామని హెచ్చరించారు. మిల్లర్లు ప్రతీసారి డిఫాల్ట్ కావడం.. గడవు తర్వాత సివిల్‌సప్లైస్ కార్పొరేషన్‌కు బియ్యం ఇవ్వడం ఇకపై కుదరదని తేల్చిచెప్పారు. కార్పొరేషన్ డంపింగ్ యార్డ్ కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పాత పద్ధతులను పక్కన పెట్టాలని చెప్పారు. గురువారం ఎంసీఆర్‌హెచ్ ఆర్డీలో సీఎంఆర్, డిఫాల్ట్ మిల్లర్ల నుంచి పెనాల్టీ వసూలు, పీడీఎస్ బియ్యం నాణ్యత, పాత గన్నీ సంచుల సేకరణ తదితర అంశాలపై అడిషనల్ కలెక్టర్లు, డీసీఎస్‌వోలు, డీఎంలతో కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.