Viral News: ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. ఈ మాటలు చాలా సార్లు వినేవే. చాలా సినిమాల్లో మద్యం సేవించే సీన్లు వచ్చినప్పుడల్లా కింద ‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ అని హెచ్చరిస్తూనే ఉంటారు. ఇవన్నీ చూసినా మనకవన్నీ ఏమీ పట్టవు. చాలా మంది మద్యానికి బానిసలై తమ జీవితాలను బుగ్గిపాలు చేసుకున్న సంఘటనలు కోకొల్లలు. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా.. మందుతోనే సహవాసం చేస్తుంటారు. పెద్దవాళ్లే కాకుండా.. మూతి మీద మీసం రానోళ్లు కూడా మద్యానికి బానిసలై జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులు ఎంత వారించినా.. వారిని నెట్టేసి నరకకూపంలోకి వెళ్తామంటారు. కొంత మంది తమ కుటుంబసభ్యులను మద్యం మాన్పించడానికి కొన్ని రకాల మెడిసిన్ వాడుతారు. మరికొంత మంది దేవుళ్లపై ప్రమాణం చేయిస్తారు. అలాగే ఓ వ్యక్తి భార్యామణి కూడా కోరుకుంది. తన భర్తను మద్యం మాన్పించాలని తన వంతు ప్రయత్నం చేసింది.
Also Read: India-Canada: “మొస్సాద్” నుంచి “రా” నేర్చుకుంది.. కెనడా వివాదంలో ఇజ్రాయిల్‌పై పాక్ మీడియా నిందలు..
ఏ భార్య అయినా తన భర్త ఆరోగ్యంగా ఉండాలని.. తాను సుమంగళిగా వర్థిల్లాలని కోరుకుంటుంది. ఏ అర్థాంగి అయినా ఇది ఆశిస్తుంది. తన భర్త మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోతే ఏ మహిళ సహించలేదు. కొందరు పెద్దలకు చెప్పుకుని బాధపడుతుంటారు. కానీ ఓ స్త్రీమూర్తి ఏమనుకుందో కానీ తన భర్తను గాడిన పెట్టి తన సంసారాన్ని చక్కదిద్దుకోవాలని నిర్ణయించుకుంది. అనుకోవడమే కాకుండా తన భర్తను ఆ గ్రామంలో దేవాలయానికి తీసుకెళ్లి ప్రమాణం చేయించింది. శివలింగంపై చేయి వేయించి ప్రమాణం చేయించింది. ఆ ఆలయ పూజారి చదువుతుండగా ఆ మందుబాబు ప్రమాణం చేశాడు. ఇక నుంచి మద్యానికి దూరంగా ఉంటానని శివలింగంపై చేయిపెట్టి ప్రమాణం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం రాచపూడి గ్రామంలో జరిగింది. ఇంత కష్టం పగవాడికి కూడా రావద్దు రా భగవంతుడా.. అంటూ నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.
Also Read: Vandebharat Express: విజయవాడ నుంచి చెన్నైకి మొదటి వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. రేపే ప్రారంభం
పూజారి మందుబాబుతో ఏమని ప్రమాణం చేయించాడో తెలుసా?
“రమ్ము, జిన్, బీరు, బ్రీజర్, వైన్, వోడ్కా, గుడుంబా, తాటికల్లు, ఈతకల్లు, తాటిచిగురు, ఈతచిగురు, విప్పసారా.. మొదలగు మత్తుపానీయములు నేటి నుండి 5 సంవత్సరముల కాలం లోపులో ఎట్టిపరిస్థితుల్లోనూ తాగనని.. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా.. నాకు పిల్లనిచ్చిన అత్తమామల సాక్షిగా.. నేను పెళ్లి చేసుకున్న నాభార్య సాక్షిగా.. నేను జన్మనిచ్చిన నా పిల్లల సాక్షిగా రాచపూడి గ్రామంలో వెలసి ఉన్న పరమేశ్వరుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.” అని ఆ వ్యక్తితో పూజారి ప్రమాణం చేయించాడు. ఇందులో ఎవరి బలవంతం లేదని పూజారి ఆ మందుబాబు చేత ఒప్పించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. ‘ఇంత కష్టం పగవాడికి కూడా రావద్దు రా భగవంతుడా’.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.