India-Canada: ఇండియా-కెనడాల మధ్య వివాదంపై పాకిస్తాన్ మీడియా పండగ చేసుకుంటోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదే చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ మాత్రం కెనడా, భారత్ బంధం వీక్ కావడంపై హ్యాపీగా ఫీల్ అవుతోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తరువాత ఇరు దేశాల మధ్య దౌత్యవివాదం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనిపై పాకిస్తాన్ మాజీ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో మాట్లాడారు. భారత్ తుంటరి దేశంగా మారిందని, నాటో సభ్యదేశం సార్వభౌమాధికారాన్ని ధిక్కరించిందని, పట్టుబడిందని వ్యాఖ్యానించాడు.
Read Also: One Nation, One Election: మీ అభిప్రాయం ఏంటీ..? రాజకీయ పార్టీలను కోరనున్న రామ్‌నాథ్ కోవింద్ కమిటీ..
పాకిస్తాన్ లో ప్రముఖ మీడియా అయిన డాన్ తన సంపాదకీయంలో కెనడా, భారత్ పై ఆరోపణలు చేసిన నేపథ్యంలో పరిస్థితులు మరింత దిగజారితే ఇబ్బందికర పరిణామాలు తప్పవని, భారత్ వీటిని గ్రహిస్తుందని ఓ సంపాదకీయాన్ని రాసింది. అయితే కెనడా-భారత్ మధ్య దౌత్య వివాదానికి ఇజ్రాయిల్ కారణమని దూషించింది. భారత్ ఉగ్రవాదిగా భావించే వారిపై దాడి చేసే పద్దతిని ఇజ్రాయిల్ గూఢాచర సంస్థ అయిన మొసాద్ నుంచి భారతీయ గూఢాచార సంస్థ ఆర్ అండ్ డబ్ల్యూ(రా) నేర్చకుందని డాన్ సంపాదకీయంలో పేర్కొంది. డైలీ టైమ్స్ పత్రిక.. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ బలమైన వైఖరి తీసుకోవాలని సూచించింది. ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ భారతదేశంలో సిక్కుల హక్కులు, మణిపూర్ హింసాకాండను ప్రస్తావిస్తూ.. భారత్ ఇప్పుడు డిఫికల్ట్ ఫేజ్ ను ఎదుర్కొంటోందని చెప్పింది.
జూన్ నెలలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలోని సర్రే ప్రాంతంలో హత్యకు గురయ్యాడు. దీనిపై రెండు రోజుల క్రితం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. ఈ హత్య వెనకాల భారత ఏజెంట్లు ఉన్నారని వ్యాఖ్యానించాడు. ఇదే కాకుండా భారత సీనియర్ దౌత్యవేత్తను కెనడా నుంచి బహిష్కరించారు. అయితే భారత్ కూడా కెనడియన్ దౌత్యవేత్తను 5 రోజుల్లో దేశం వదిలి వెళ్లాలని ఆదేశించింది. కెనడా ఆరోపణలను అసంబద్ధ, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా భారత్ అభివర్ణించింది, అంతే కాకుండా కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని భారత్ ధ్వజమెత్తింది.