మద్యం సేవించి డ్రైవింగ్ చేయొద్దని పోలీసులు చెబుతున్నా.. మందు బాబులు మాత్రం వినడం లేదు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా.. లిక్కర్ రాజాలు మాత్రం మత్తు వదలడం లేదు. వీకెండ్ వచ్చింది అంటే చాలు.. పూటుగా తాగి వాహనాలు నడుపుతూ అడ్డంగా బుక్కవుతున్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసులు, కోర్టులు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా మద్యం సేవించి బస్సు నడిపిన ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్‌కు నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధించింది.
Also Read: Duvvada Madhuri-Appanna: దువ్వాడ మాధురి, అప్పన్న ఆడియో కేసులో బిగ్ ట్విస్ట్!
కన్నెబోయిన మహేష్ బాబు ఇంటర్‌సిటీ యూనివర్సల్ ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. 2025 డిసెంబర్ 15న ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో పోలీసుల స్పెషల్ డ్రైవ్ చేపట్టగా.. డ్రైవర్ మహేష్ బాబు పట్టుబడ్డాడు. బ్రీత్ అనలైజర్ పరీక్షలో 119.100 mg రక్తంలో ఆల్కహాల్ సాంద్రత చూపించింది. ట్రాఫిక్ పోలీసులు అతడిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి.. నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. డ్రైవర్ మహేష్ బాబుకు నాంపల్లి కోర్టు 15 రోజుల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు రూ.2,100 జరిమానా కూడా విధించింది.