ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీ కీలకం. అయితే కొంతమంది ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యం, ప్రవర్తనల కారణంగా ప్రయాణికులు గురవుతున్నారు. కొందరు మద్యం తాగి బస్సులను నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. డ్రైవర్, కండక్టర్ మద్యం మత్తులో ఉండడంతో బస్సులోని ప్రయాణికులు ప్రాణ భయంతో వణికిపోయారు. మహారాష్ట్ర రాష్ట్ర రవాణా శాఖ నిర్లక్ష్యంపై ప్రజలు మండిపడుతున్నారు.
Also Read:Asim Munir: సైనిక ప్రభుత్వం దిశగా పాకిస్తాన్, షహబాజ్ షరీఫ్‌కు ఆసిమ్ మునీర్ చెక్..
పంధర్‌పూర్ నుంచి అకోట్‌కు వెళ్తున్న ST(స్టేట్ ట్రాన్స్ పోర్ట్) బస్సు డ్రైవర్, కండక్టర్ మద్యం తాగి ఉన్నట్లు గుర్తించారు. ఈ సంఘటన బీడ్ జిల్లాలో జరిగింది. ఇద్దరూ మద్యం తాగి ఉండటం వల్ల బస్సులోని 37 మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయి. శనివారం నాడు MH-14-6140 నంబర్ గల ఈ బస్సు అకోట్ డిపో నుంచి వార్కారీకి ప్రయాణికులతో బయలుదేరినప్పుడు ఈ సంఘటన జరిగింది. బస్సు డ్రైవర్ సంతోష్ రహతే, కండక్టర్ సంతోష్ ఝలతే డ్యూటీ సమయంలో మద్యం సేవించి ఉన్నారు. మార్గమద్యంలో బస్సు బీడ్ జిల్లా సరిహద్దుకు చేరుకున్నప్పుడు, డ్రైవర్ బస్సును సరిగ్గా నడపలేకపోతున్నాడని, కండక్టర్ తన సీటుపై పడుకుని దొర్లుతుండడాన్ని ప్రయాణికులు గమనించారు.
Also Read:Ganja Batch : హైదరాబాద్‌లో రెచ్చిపోతున్న గంజాయి గ్యాంగులు
అనుమానం వచ్చిన ప్రయాణికులు బస్సును ఆపి బీడ్ రవాణా శాఖకు, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, ఎస్టీ అధికారులు వెంటనే అప్రమత్తమై సంఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్, కండక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో, ఇద్దరూ మద్యం సేవించినట్లు అంగీకరించారు. వారిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపారు. నివేదిక వచ్చిన తర్వాత, సస్పెన్షన్, తొలగింపుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మద్యం సేవించి విధులకు హాజరైన డ్రైవర్, కండక్టర్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు.