Simhachalam: సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో అపచారం చోటుచేసుకుంది. సింహగిరి కొండపై మందుబాబులు దుకాణం తెరిచారు. పెళ్లిళ్లకు హాజరయ్యేందుకు వచ్చి దేవుడు సన్నిధిలో మందు కొడుతూ చిందులేస్తున్నారు. నిన్న ఒక్కరోజే ఎక్కువ వివాహాలు జరిగాయి. కాటేజ్‌లతోపాటు మండపాలన్ని కూడా నిండిపోయాయి. ఈ వివాహాలకు వచ్చిన కొందరు ఆలయ గాలిగోపురం సమీపంలోనే మందు తాగుతూ తిరుగుతున్న దృశ్యాలు కనిపించాయి. సింహగిరిపై మద్యం మాంసం నిషేధం అనే విషయం తెలిసిందే. ఉల్లంఘించిన వారికి దేవాదాయ చట్టం ప్రకారం శిక్షలు పడతాయి. కానీ , దేవస్థానం ప్రాంగణంలోనే విందు వినోదాలు చేసుకుంటున్నా.. నియంత్రించే వ్యవస్థ పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. సింహాచలంలో మద్యం సేవించడంపై విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బాధ్యులైన సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.