నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూ.. ఓ వైద్య విద్యార్దిని అర్ధాంతరంగా తనువు చాలించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. డాక్టర్ శ్వేత మృతితో.. జిల్లా ఆసుపత్రిలో వైద్యులపై పడుతున్న ఒత్తిడి, వైద్య పోస్టుల ఖాళీలపై సర్వత్రా చర్చ నడుస్తోంది. అద్దాల మేడలా ఉండే.. ? జిల్లా ఆసుపత్రిలో వైద్యుల ఖాళీలు ఏ మేరకు ఉన్నాయి.? గైనకాలజీ విభాగంలో పరిస్దితి ఏంటి..? ఖాళీలపై అధికారులు ఏమంటున్నారు.. పీజీ విద్యార్ధుల పై భారమెంత..? డాక్టర్ శ్వేత మృతికి పని ఒత్తిడి ఓ కారణమా.. అసలేం జరుగుతోంది?
నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి ఏడంతస్తుల అద్దాల మేడ. 500 పడకల స్దాయి నుంచి.. ప్రస్తుతం 750 పడకలతో మూడు జిల్లాల రోగులకు సేవలందిస్తోంది. కరోనా సమయంలో జిల్లా వైద్యులు చేసిన సేవలకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇంత వరకు బాగానే ఉన్నా నిన్న గైనకాలజీ వార్డులో విధులు నిర్వర్తిస్తూ.. వైద్య విద్యార్దిని డాక్టర్ శ్వేత మృతితో.. ఇప్పుడు జిల్లా ఆసుపత్రిలో వైద్యుల ఖాళీల అంశంపై చర్చ జరుగుతోంది.
వైద్యుల కొరత కారణంగా విపరీతమైన ఒత్తిడి గైనకాలజిస్టులపై పడుతోందనే ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ప్రతీ రోజు 30 నుంచి 50 మెటర్నిటీ కేసులు జిల్లా జనరల్ ఆసుపత్రికి వస్తున్నాయి. 90 శాతం నార్మల్ డెలివరీలు చేయాలని వైద్యుల పై ఒత్తిడి ఉంది. 30 మంది వైద్యులు ఉండాల్సిన చోట ప్రస్తుతం 14 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. షిప్ట్ కు ఓ గైనకాలజిస్టు ఓ సీనియర్ రెసిడెంట్, పీజీ వైద్యులు మాత్రమే ఉంటున్నారు. గైనకాలజిస్టుల కొరత కారణంగా ఉన్న వైద్యులపై భారం పెరిగి పని ఒత్తిడికి గురవుతున్నారని వైద్య వర్గాలు ఆవేదన చెందుతున్నాయి.
వైద్యులు, సిబ్బంది కొరత తీర్చాలని గతంలో పలు మార్లు జిల్లా అధికారులు ప్రభుత్వానికి లేఖలు రాశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్దతిలో వైద్యుల నియామకానికి సర్కారు అనుమతించింది. ఐతే ఖాళీల భర్తీలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఖాళీలు భర్తీ చేయకపోవడం వల్లే.. ఉన్న వైద్యులపై పని భారం పెరగి ఒత్తిడికి గురవుతున్నారని మండిపడుతున్నారు.
నిజామబాద్ జిల్లా ఆసుపత్రికి అనుబంధంగా మెడికల్ కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లా ఆసుపత్రిలోని అన్ని విభాగాలకు కలిపి ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 284 మంది ఉండాల్సి ఉండగా అధికారిక లెక్కల ప్రకారం 109 ఖాళీలు ఉన్నాయి. వైద్యులతో పాటు స్టాఫ్ నర్సులు పారా మెడికల్ సిబ్బంది పోస్టులు సగానికి పైగా ఖాళీలు ఉన్నాయి. ఖాళీల భర్తీ పై అధికారులు దృష్టి పెట్టకపోవడం ఉన్న వైద్యులపై పని భారం పెరుగుతుంది. రెగ్యులర్ వైద్యులు లేకపోవడం వల్ల చదువుకునే వైద్య విద్యార్దుల పై భారం పడుతోంది. అని వసతులు కల్పించి.. ఖాళీలను భర్తీ చేస్తే వైద్య విద్యార్ధులపై పని భారం, ఒత్తిడి తగ్గుతుందని , ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని వైద్యనిఫుణులు చెబుతున్నారు. ఆసుపత్రిలో ఖాళీలు ఉన్న మాట వాస్తవం అని చెబుతున్న సూపరింటెండెంట్ .. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్దతిలో భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. పని ఒత్తిడి లేదని వివరించారు. ఇటు మెడికల్ కళాశాలలోనూ ఖాళీలున్నాయని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ చెప్పుకొచ్చారు.
పీజీ వైద్యురాలు డాక్టర్ శ్వేత మృతికి వైద్యులు చెబుతున్నట్లు.. కరోనా కారణంగా వచ్చిన గుండెపోటు అయి ఉండొచ్చు. కానీ వైద్యుల కొరత, పీజీ వైద్యులపై పడుతున్న పని భారం కూడా ఓ కారణంగా గుర్తించాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. ఇప్పటికైనా సర్కారు వైద్యుల ఖాళీల భర్తీపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Andhra Pradesh: ఉపాధ్యాయులకు ఈనెల 22 వరకు సెలవులు రద్దు