ఏపీలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులకు వేసవి సెలవులను రద్దు చేస్తూ ప్రభుత్వం పనిచేయించుకుంటోంది. తాజాగా కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల ఉపాధ్యాయులకు ఈ నెల 22 వరకు సెలవులు లేవని సమగ్ర శిక్ష అభియాన్ ప్రకటించింది. కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ప్రవేశాల పేరుతో టీచర్ల పనిదినాలను అధికారులు పొడిగించారు. విద్యార్థినుల ప్రవేశాల కోసం సిబ్బంది ప్రచారం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అంతేకాకుండా 100 శాతం ప్రవేశాలు సాధించాలని టీచర్లకు ఆదేశాలు జారీ చేశారు. అయితే వేసవి సెలవులను రద్దు చేయడంతో కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో పనిచేసే ఉపాధ్యాయులు అసంతృప్తికి గురవుతున్నారు.
Andhra Pradesh: రైతులకు శుభవార్త.. రేపు వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు జమ
మరోవైపు ప్రభుత్వ టీచర్లకు కూడా మే 20 వరకు సెలవులను గతంలో ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పదో తరగతి మినహా మిగతా తరగతుల విద్యార్థులకు మే 6 నుంచే సెలవులు ప్రకటించగా.. టీచర్లకు మాత్రం మే 21 నుంచి సెలవులు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నవారికే సెలవులు ఇస్తామని ప్రకటించింది. దీంతో మే 20 తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే టీచర్లకు సెలవులు అందుబాటులోకి రానున్నాయి.