YSR Congress Party: నెల్లూరు జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైసీపీలో నేతల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. కాకాణి గోవర్ధన్‌రెడ్డి మంత్రిగా నిర్వహించే సమావేశాలకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరు కావడంలేదు. ఇక.. ఇటీవల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి.. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీకి దూరమయ్యారు. అనిల్ కుమార్‌కు బాబాయ్ వరుసయ్యే రూప్ కుమార్ యాదవ్ ఆయనతో విభేదించి ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. ఆయన సొంతంగానే కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అనిల్ కుమార్ యాదవ్ వ్యవహార శైలిపై మంత్రి కాకాణి.. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి.. జిల్లా పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
నెల్లూరు రూరల్ పరిధిలోని అల్లిపురం వద్ద అనిల్ అనుచరుడు లే ఔట్ వేశారు. నీటిపారుదల శాఖకు చెందిన స్థలం కూడా అందులో కలిపేశారనే ఆరోపణలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనిల్ మద్దతిస్తున్నారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. నెల్లూరు రూరల్ పరిధిలోని కొత్తూరు అంబాపురం వద్ద ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకున్నారు. ఆ విషయంలో అనిల్ అనవసరంగా జోక్యం చేసుకున్నారని దళిత సంఘాలు విమర్శలు చేశాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయ కర్తగా ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయనతో సంప్రదించకుండానే రూరల్ వ్యవహారాల్లో అనిల్ జోక్యం చేసుకుంటుండటం ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఆగ్రహం తెప్పించింది. అనిల్ వ్యవహారశైలిపై ఆదాల ప్రభాకర్ రెడ్డి మంత్రి కాకాణి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.
మరోవైపు, ఇటీవల జిల్లా పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో మంత్రి కాకాణి సమావేశమయ్యారు. అదే సమయంలో హైదరాబాద్‌లో ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని హుటాహుటిన నెల్లూరుకు రావాలని సూచించారు. దీంతో ఆయన తిరుపతి విమానాశ్రయం నుంచి నేరుగా కాకాణి ఇంటికి వెళ్లారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. కాకాణి గోవర్ధన్ రెడ్డితో ఆదాల సమావేశమయ్యారు. అనిల్ కుమార్ వ్యవహర శైలిపైనే వీరు చర్చించినట్టు సమాచారం. నేతల మధ్య సమన్వయం కోసం సీఎం జగన్ త్వరలోనే జిల్లా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతలు కలిసికట్టుగా పనిచేయకపోతే పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశంతోనైనా నేతల మధ్య విభేదాలు తొలగుతాయో లేదో చూడాల్సిందే.