నిజామాబాద్ లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ వైపు ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటింటికీ తిరుగుతూ మళ్లీ తనను ఆశీర్వదించాలని ఓటర్లను కోరుతున్నారు. మరో వైపు ధర్మపురి సంజయ్ అరవింద్ పై విరుచుకు పడుతున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ దేవుని పేరిట రాజకీయాలు చేస్తోందని ధర్మపురి సంజయ్ అన్నారు. దేవునికి రాజకీయాలకు సంబంధం లేదని.. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడగడం నైతికం కాదన్నారు. ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానంటూ బాండ్ పేపర్ రాసిచ్చి రైతులను మోసం చేశారన్నారు.
READ MORE: 10th Results: తన మార్క్స్ ను చూసుకొని ఆనందంతో మూర్చబోయిన విద్యార్థి..
రైతులను నిట్టనిలువునా మోసం చేసిన బీజేపీకి ఎన్నికల్లో బుద్ది చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. టర్మరిక్ బోర్డు స్థాపించే ఆలోచన లేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి చెప్పిన మాటలను గుర్తు చేశారు. మోడీ గతంలో కర్ణాటకలో పసుపు బోర్డుపై ప్రకటన ఎలా చేశారని ప్రశ్నించారు. బీజేపీ చెప్పే అబద్ధాలు విని ప్రజలు మళ్ళీ మోసపోవద్దని చెప్పారు. అరవింద్ ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలన్నారు. నిజామాబాద్ ఎంపీగా.. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఓటర్లను కోరారు.