ఎవరైనా వచ్చి మాకు సహాయం చేయండి, మేము మా ఇల్లు కోల్పోయాము. నౌషీన్ (కుటుంబ సభ్యుడు) బతికే ఉందో లేదో మాకు తెలియడం లేదు. ఆమె బురదలో కూరుకుపోయింది. తన నోరు బురదతో నిండిపోయింది. ఎవరైనా ఆమెను రక్షించండి. కేరళలోని వాయనాడ్‌లోని చుర్లమల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంలో చిక్కుకున్న మహిళ సహాయం కోసం ఈ రకంగా విజ్ఞప్తి చేసింది. నడుము వరకు బురద, చెత్తాచెదారంలో చిక్కుకుపోయినప్పటికీ, తన కుమార్తెను కాపాడండని సాయం కోసం వేడుకోవడం చూపరులను కంటతడి పెట్టించింది. ఆమెకు ఏమైనా ఫర్వాలేదు కానీ తన కుమార్తెను రక్షించమని కనిపించి వాళ్లనల్లా ప్రాధేయపడుతుంది. కానీ ఆ మహిళ ఎలాగోలా తన ప్రాణాలను కాపాడుకుంది, కానీ ఆమె కుమార్తెను బతికించుకోలేకపోయింది. ఆమె కేకలు వేసి సాయం కోసం వేడుకుంది కానీ.. దేవుడు ఆమె మొర వినలేదు. సహాయం ఆమెను చేరుకోలేదు. దీంతో నౌషిన్ ప్రాణాలను పోగొట్టుకుంది.
వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రదేశం ఒక మరుభూమిలా ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత బయటకు వచ్చిన వీడియోలు సామాన్యులను షాక్‌కు గురిచేస్తున్నాయి. వీడియోలో ప్రజలు ఏడుస్తూ సహాయం కోసం వేడుకుంటున్నారు. ప్రజలు మెడ వరకు బురదలో కూరుకుపోయారు. ఇప్పటికీ చాలా మంది ఇళ్లు, శిథిలాల కుప్పల కింద సమాధి అయ్యారు. కొండచరియలు విరిగిపడటంతో జిల్లా ఆసుపత్రిలో విషాదం నెలకొంది. నేలపై పడి ఉన్న మృతదేహాల వరుసలలో తమ వారి కోసం వెతుక్కుంటున్నారు. కొందరు వ్యక్తులు తమ వారి మృతదేహాలను చూసి షాక్‌కు గురయ్యారు. మరికొందరు గాయపడిన వారి బంధువులను చూసి బతికి ఉన్నారు అంతే చాలని ఊపిరి పీల్చుకున్నారు. కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు పిల్లలు సహా తమ కుటుంబంలోని ఐదుగురు గల్లంతయ్యారని ఓ యువతి తెలిపింది. తనకు చాలా కాలంగా పరిచయమున్న 12 ఏళ్ల బాలికతో సహా నలుగురు సభ్యుల కుటుంబం కోసం వెతుకుతున్నట్లు స్థానిక అంగన్‌వాడీ వర్కర్ ఒకరు తెలిపారు.
Read Also:Breaking News: లిక్కర్ కేసు ఛార్జ్ షీట్ పై మరోసారి వాయిదా..
ఉత్తర భారతదేశానికి చెందిన నలుగురు పర్యాటకులు, కర్ణాటకకు చెందిన ఒక టాక్సీ డ్రైవర్ కూడా కొండచరియలు విరిగిపడటంతో గల్లంతయ్యారు. బెంగళూరులోని ట్యాక్సీ సర్వీస్ ప్రొవైడర్ సచిన్ గౌడ మాట్లాడుతూ.. గత గురువారం ఆన్‌లైన్ బుకింగ్‌లో నలుగురు పర్యాటకులను బెంగళూరు విమానాశ్రయం నుంచి వాయనాడ్‌కు ఎర్టిగా కారులో తీసుకెళ్లినట్లు తెలిపారు. రెండు రోజులు అక్కడే ఉన్నాడు. మంగళవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో వారంతా అక్కడ చిక్కుకుపోయారు. ఎక్కడ చూసినా నీళ్లు ఉన్నాయని టాక్సీ డ్రైవర్ సోమవారం రాత్రి చెప్పాడని సచిన్ గౌడ తెలిపారు. పర్యాటకులలో ఇద్దరు మహిళలను తరువాత రక్షించారు. ఒకరు ICU లో చికిత్స పొందుతున్నారు. మరొకరి పరిస్థితి బాగానే ఉంది. మరో ఇద్దరు గల్లంతయ్యారు. వారి ఫోన్‌లు కూడా స్విచ్ ఆఫ్‌లో ఉన్నాయి.
వయనాడ్‌లో రాబోయే రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్, పొరుగున ఉన్న మలప్పురం, కోజికోడ్, కన్నూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలు దెబ్బతినే అవకాశం ఉంది. వాయనాడ్‌లో ఇప్పటివరకు 250 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. వివిధ కేంద్ర ఏజెన్సీలకు చెందిన 300 మంది సిబ్బందిని రెస్క్యూ, రిలీఫ్ పనుల కోసం మోహరించారు. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
వాయనాడ్ ప్రమాదం తర్వాత కేరళ ప్రభుత్వం రాష్ట్రంలో రెండు రోజుల సంతాప దినాలు ప్రకటించింది. ఈ దురదృష్టకర ఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. జులై 30, 31 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా సంతాప దినాలు ఉంటాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీ వేణు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. వాయనాడ్‌లోని మెప్పాడి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి మృతి చెందిన వారికి భారత్‌లోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ సంతాపం తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో మాట్లాడి వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన సంఘటనల పరిస్థితిని సమీక్షించారు.
Read Also:MLC Elections 2024: ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి.. అమల్లోకి ఎలక్షన్ కోడ్..