తుఫాన్ నష్టం, అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ, కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్, జిల్లా అటవీశాఖ అధికారులు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ అధికారులతో సుదీర్ఘ చర్చలు జరిపారు.
కృష్ణా నదిపై హై లెవెల్ వంతెనతో దీవుల్లోని గ్రామాలను అనుసంధానం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు సాస్కీ పథకం నిధులు మంజూరుకు నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో అవనిగడ్డ పరిధిలో అవుట్ ఫాల్ స్లూయిజ్ ల పునరుద్ధరణ చేయాలని చెప్పారు. నిర్ణీత కాల వ్యవధిలో పనులు పూర్తి చేసే విధంగా ప్రణాళికలు చేయాలన్నారు. అటవీ శాఖ అనుమతుల కోసం నిలిచిన అభివృద్ధి పనులకూ మోక్షం కలిగించాలని డిప్యూటీ సీఎం అధికారులతో అన్నారు.
Also Read: Prabhas Spirit: స్పిరిట్లో దగ్గుబాటి హీరో?.. అస్సలు ఊహించలేరు!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు రోజులపాటు తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 8వ తేదీ తిరుపతి జిల్లా పరిధిలోని ఎర్రచందనం డిపోని సందర్శిస్తారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో ఎర్రచందనం అక్రమ రవాణా, స్మగ్లింగ్ నిరోధంపై టాస్క్ ఫోర్స్, అటవీ శాఖ అధికారులతో నిర్వహించే సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. 9వ తేదీ పలమనేరులోని కుంకీ ఏనుగుల క్యాంపును సందర్శిస్తారు. కుంకీ ఏనుగుల సంరక్షణతో పాటు ఏనుగులు, మనుషుల మధ్య సంఘర్షణ నియంత్రణకు అనుసరిస్తున్న నూతన సాంకేతిక విధానాలను పరిశీలిస్తారు.