Narayana Swamy: ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ల మార్పులు, చేర్పుల వ్యవహారం కొందరు నేతలకు మింగుడుపడడం లేదు.. ఉన్నట్టుండి స్థానం మారిస్తే ఎలా? అనేవాళ్లు కొందరైతే.. తనను పక్కనబెట్టి మరో వ్యక్తికి టికెట్ ఇస్తే ఊరుకునేది లేదనేవాళ్లు ఇంకా కొందరు.. ఇక, ఏదేమైనా అధినేత ఆదేశాలకు కట్టుబడి పనిచేస్తామనేవాళ్లు మరికొందరు.. ఇప్పుడు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. నాకు టికెట్ రాకపోతే ఆత్మ అభిమానాన్ని చంపుకొని జ్ఞానేందర్ రెడ్డితో కలిసి పనిచేసేది లేదని తేల్చేశారు. నాకు ఏమీ ఆస్తులు, అంతస్తుల లేవు కాపాడుకోవడానికి.. నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదంటూ.. మండలనేతల సమావేశంలో నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
Read Also: Kalti Kallu: గోదావరిఖనిలో విషాదం.. మందు పార్టీ అనంతరం ఇద్దరు స్నేహితుల దుర్మరణం!
ఇక, నారాయణ స్వామికి టికెట్ ఇవ్వకపోతే మాకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతో పని లేదంటున్నారు స్థానిక నేతలు, నారాయణస్వామి అభిమానులు.. మా నేతకు టికెట్ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామని మరికొందరు నేతలు అంటున్నారు. ఏది ఏమైనా జ్ఞానేందర్ రెడ్డితో కలసి వెళ్లే ప్రసక్తి లేదంటున్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి పుత్తూరు నివాసంలో ఆరు మండలాల నాయకులతో ఆత్మీయ సమావేశం జరిగింది.. ఆరు మండలాల నాయకులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారాయన.. డిప్యూటీ సీఎం అయిన నారాయణస్వామి పక్కన కుర్చీవేసుకుని దర్జాగా కూర్చునే స్వేచ్ఛ ఉంది.. జ్ఞానేందర్ రెడ్డి దగ్గర ఆ పరిస్థితి ఉందని వైసీపీ నేతలు వాపోయారు.. ఈ సమావేశంలో కొందరు నేతలు నారాయణస్వామి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. కాగా, ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. ఈ సారి ఆయనకు టికెట్ దక్కడం కష్టమే చర్చ సాగుతోన్న తరుణంలో.. ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేయడం.. టికెట్ ఇవ్వకపోతే కలిసి పనిచేసేది లేదంటూ తెగేసి చెప్పడం సంచలనంగా మారింది.