Bhatti Vikramarka: తోటి మనుషులను ప్రేమించాలని, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలి పేదలకు చేయూతను అందించి పైకి తీసుకురావాలి.. సంఘంతో జీవించాలి అన్న క్రీస్తు బోధనలకు అనుగుణంగా ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటూ, పేదలకు చేయూతనిస్తూ అభివృద్ధిలోకి తీసుకొస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రైస్తవ ప్రతినిధుల సభలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పని చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాటిని అధిగమిస్తూ ప్రజల అభివృద్ధికి కావలసిన ప్రణాళికలను రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులం సమిష్టిగా తయారు చేసి అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధిలోకి తీసుకురావడానికి ముందుకు వెళ్తున్నామన్నారు.
Read Also: Telangana Caste Survey: రాష్ట్ర వ్యాప్తంగా 95 శాతం సర్వే పూర్తి
విద్య, వైద్యానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మాణం చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను పేదలకు ఉచితంగా అందించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళుతున్నామన్నారు. ఇండ్లు లేని పేదలకు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేయాలని దీపావళి నుంచి మొదలుపెట్టామన్నారు. సమాజంలో సగభాగం ఉన్న మహిళలను మహాలక్ష్మిగా గౌరవిస్తూ ప్రజా ప్రభుత్వం వారికి ఉచితంగా ఆర్టీసీ బస్సు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుందన్నారు. రాష్ట్రంలో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న రవాణా డబ్బులను వారి తరఫున ఆర్టీసీకి ప్రతినెల ప్రజా ప్రభుత్వం 400 కోట్ల రూపాయలు చెల్లిస్తుందన్నారు.
Read Also: Minister Uttam Kumar Reddy: సింగూరు, మంజీరాలకు గోదావరి జలాలు
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా గృహ జ్యోతి పథకాన్ని తీసుకువచ్చి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును పేదలకు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో వ్యవసాయదారులకు అందిస్తున్న ఉచిత విద్యుత్తుకు నెలకు రూ.1000 కోట్లు ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లిస్తుందన్నారు. నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి ,జాబ్ క్యాలెండర్ ప్రకటించి, ఇప్పటి వరకు 55 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 500 రూపాయలకే మహిళలకు గ్యాస్ సిలిండర్‌ను అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఆహార ధాన్యాలు ఉత్పత్తి పెంచడానికి, రైతులను ప్రోత్సహించడానికి, కేవలం 15 రోజుల్లోనే రెండు లక్షల రుణాలు ఉన్న రైతులందరికీ 18 వేల కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేసి రుణమాఫీ చేశామన్నారు.
కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవాలన్న క్రీస్తు మార్గం అనుసరిస్తూ ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం ముందుకుపోతుందన్నారు. మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించడానికి ఏడాదికి 20వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. ఐదు సంవత్సరాలలో లక్ష కోట్ల రుణాలు ఇప్పిస్తామని ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు. అభివృద్ధిలో అందరినీ భాగస్వామ్యం చేయడానికి సమాజ హితం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.