Telangana Caste Survey: సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల గణన సర్వే బుదవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 95 శాతం పూర్తయింది. ఈ సమగ్ర ఇంటింటి సర్వేలో మొత్తం 1,18,02,726 నివాసాలను గుర్తించారు. బుధవారం నాటికి 1,10,98,360 నివాసాలలో సమాచార సేకరణ పూర్తవగా.. కేవలం 7,04,366 నివాసాల సర్వే సమాచారాన్ని మాత్రమే సేకరించాల్సి ఉంది. సేకరించిన వివరాలను అధికారులు కంప్యూటరీకరించడంలో పూర్తి జాగ్రత్తలు తీసుకొంటూ వేగవంతంగా సమాచారాన్ని కంప్యూటరీకరిస్తున్నారు. ఈ ప్రక్రియనంతా సంబందిత ఉన్నతాధికారులు నేరుగా పర్యవేక్షిస్తున్నారు.
Read Also: Minister Uttam Kumar Reddy: సింగూరు, మంజీరాలకు గోదావరి జలాలు
అత్యధికంగా 70.3 శాతం సమాచారాన్ని కంప్యూటరీకరించి ములుగు జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. 59.8 శాతం సమాచారాన్ని కంప్యూటరీకరించి యాదాద్రి భువనగిరి జిల్లా రెండవ స్థానంలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా నేటి వరకు సేకరించిన సమాచారంలో 29,82,034 నివాసాల సర్వే సమాచారాన్ని కంప్యూటరీకరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కూడా సర్వే ప్రక్రియ ఊపందుకుంది. 25,05,517 నివాసాలు సర్వే చేయాల్సి ఉండగా.. నేటి వరకు 20,15,965 నివాసాలలో సర్వే పూర్తి చేసి 80.5 శాతానికి చేరుకుంది. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణలో కంప్యూటరీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. సర్వే పత్రాలను సమగ్రంగా భద్రపరచడమే కాకుండా తప్పులు లేకుండా ఆన్ లైన్‌లో నమోదు చేసేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.