సెంట్రల్ ఢిల్లీలోని (Delhi) పటేల్ నగర్ రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ ప్యాసింజర్ రైల్లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. మంటలు అంటుకున్న సమయంలో రైలు బోగీలు అన్ని ఖాళీగా ఉన్నాయి. ట్రైన్‌లో ప్రయాణికులెవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
పటేల్ నగర్ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ 3 మీద సిర్సా ఎక్స్‌ప్రెస్ ఆగి ఉంది. మధ్యాహ్నం 1.33 గంటలకు ఒక్కసారిగా రైల్లో మంటలు అంటుకున్నాయి (Train Empty Coach Fire). రైల్వే అధికారులు అలర్ట్ అయి ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది స్టేషన్‌కు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మధ్యాహ్నం 2.25 గంటలకు మంటలు అదుపులోకి వచ్చినట్లు అధికారి తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అన్ని బోగీలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని అనుమానిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇదిలా ఉంటే తమ డిమాండ్ల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున అన్నదాతలు (Farmers Protest) ఢిల్లీకి పోటెత్తారు. ట్రాక్టర్లుతో ఢిల్లీలోకి అడుగుపెడుతున్నారు. ఇంకోవైపు నిరసనకారులు రాజధానిలోకి అడుగుపెట్టకుండా సరిహద్దుల్లో పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరించాయి. రోడ్డుపైన బారికేడ్లు, సిమెంట్ దిమ్మెలు, ఇనుపకంచెలు వేశారు.
అలాగే రైతుల ఆందోళనల నేపథ్యంలో మెట్రో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఎనిమిది మెట్రో స్టేషన్లలో ప్రధాన గేట్లను ఢిల్లీ మెట్రో అధికారులు మూసివేశారు.