ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడిస్తున్న ఓమిక్రాన్ వేరింయట్ తాజగా దేశంలో కూడా వ్యాప్తి చెందడంతో ఢిల్లీ సర్కార్ అప్రమత్తమైంది. దీంతో కరోనాకు సంబంధించిన అన్ని మౌలిక సౌకర్యాలను కల్పించేందుకు కేజ్రివాల్ సర్కార్ సిద్ధమైంది. 30,000 కంటే ఎక్కువ కోవిడ్ పడకలు, ఆక్సిజన్ సరఫరాను పెంచడంతో ఓమిక్రాన్ ఎదుర్కొంటామన్నారు. 442 MT ఆక్సిజన్ నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, 21 MT ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచినట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఢిల్లీలో ఉన్న పరిస్థితులను వివరించారు.
కరోనావైరస్, ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆందోళన పెడుతుంది. ఇది భారతదేశంలోకి ప్రవేశించకూడదని లేదా వ్యాప్తి చెందదని మేము ఆశిస్తున్నామని ప్రార్థిస్తున్నాము. ఒకవేళ ఈ ముప్పు సంభవించే అవకాశం ఉన్నట్లయితే, వైరస్‌ను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని సన్నాహాలను ముందుగానే ఏర్పాటు చేసుకోవడం బాధ్యతయుతమైన ప్రభుత్వంగా మా కర్తవ్యం అని కేజ్రీవాల్ తెలిపారు.
ఆక్సిజన్ కొరతను నివారించడానికి 6,000 ఆక్సిజన్ సిలిండర్లు దిగుమతి చేసుకున్నామని,15 ఆక్సిజన్ ట్యాంకర్లను కొనుగోలు చేశారు. దాదాపు 97% మంది ఢిల్లీ వాసులు టీకా మొదటి డోస్‌ను వేసుకున్నారన్నారు. 57శాతం మంది పూర్తిగా టీకాలు వేసుకున్నారన్నారు. ఢిల్లీ ప్రజలు తమ రెండవ డోస్‌ను త్వరగా వేసుకోవాలని కేజ్రీవాల్ సూచించారు. పడకల విషయానికొస్తే, మే 2021లో రెండవ వేవ్‌లో ఆసుపత్రులలో పడకల సామర్థ్యాన్ని 25,106కి పెంచామని, ఇప్పుడు 30,000 ఆక్సిజన్ బెడ్‌లను ఏర్పాటు చేశామన్నారు. వాటిలో 10,000 ICU పడకలు ఉన్నాయన్నారు. అదనంగా మరో 6,800 ఐసియు పడకలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయన్నారు.
ఫిబ్రవరి 2022 నాటికి ఇవి కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. త్వరలో ఐసియు పడకల సామర్థ్యాన్ని 17,000 వరకు తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. రెండు వారాల నోటీసుపై ప్రతి మున్సిపల్ వార్డులో 100 ఆక్సిజన్ బెడ్‌లను ఏర్పాటు చేసే విధంగా మేము మా సన్నాహాలు చేస్తున్నామన్నారు. 270 వార్డులకు, 27,000 ఆక్సిజన్ బెడ్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొత్తం 63,800 పడకలను తీసుకు వచ్చే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు.