దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కత్తితో బెదిరించి 14 ఏళ్ల బాలుడిపై అతడి స్నేహితులు అసహజ లైంగిక దాడికి పాల్పడిన ఘటన మరువకముందే.. మరో ఘటన చోటుచేసుకుంది. అసహజ శృంగారానికి బలవంతం చేసిన 20 ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలో జనవరి 17న జరగ్గా.. 19న విషయం వెలుగులోకి వచ్చింది. తలపై బండ రాయితో కొట్టడంతో యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. నిందితుడు బిహార్‌కు చెందిన రాజేశ్‌గా ఢిల్లీ పోలీసులు గుర్తించారు.
జనవరి 19న ఢిల్లీలోని మోరీ గేట్‌కు దగ్గరలోని డీడీఏ పార్క్ వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించగా.. యువకుడి శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయి. మృతదేహాన్ని మార్చురీకి తరలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించగా.. మృతుడు ఉత్తర్ ప్రదేశ్‌లోని జలాన్ జిల్లాకు చెందిన ప్రమోద్ కుమార్ శుక్లాగా గుర్తించారు.
ప్రమోద్ కుమార్ శుక్లా కోయా మండిలోని ఓ దుకాణంలో పని చేస్తూ.. నైట్ షెల్టర్‌లో ఉంటున్నాడు. ఫుటేజ్‌లో ప్రమోద్‌తో పాటు రాజేశ్ అనే యువకుడు కనిపించాడు. దీంతో రాజేశ్‌ను పట్నాలో అదుపులోకి తీసుకుని విచారించారు. తనను ప్రమోద్ అసహజ శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి చేసేవాడని పోలీసులకు నిందితుడు రాజేశ్ చెప్పాడు. చాలాసార్లు వద్దని చెప్పానని, అయినా ప్రమోద్ వేధిస్తూనే ఉన్నాడని తెలిపాడు. ప్రణాళిక ప్రకారమే తాను ప్రమోద్‌ను హత్య చేసినట్లు రాజేశ్ పోలీసులకు తెలిపాడు. పోలీసులు రాజేశ్‌ను అరెస్ట్ చేశారు.