Union Cabinet: ఢిల్లీ పేలుడు ఘటనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఢిల్లీ పేలుళ్లను ఉగ్రవాద సంఘటనగా గుర్తించి, కేబినెట్ సమావేశంలో బాధితులకు నివాళులర్పించింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం.. ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనలో ప్రాణనష్టంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని మంత్రి వర్గం రెండు నిమిషాలు మౌనం పాటించింది.
READ MORE: SSMB29: రాజమౌళి లీక్ స్ట్రాటజీ మాములుగా లేదుగా.. ‘సంచారి’ సాంగ్ వెనక మైండ్ గేమ్..?
ఈ కేబినెట్ భేటీ అనంతరం.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. 2025 నవంబర్ 10 సాయంత్రం ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటన దేశ వ్యతిరేక శక్తులు చేసిన దారుణమైన ఉగ్రవాద సంఘటనను దేశం చూసింది. ఈ పేలుడు ఫలితంగా ప్రాణ, ఆర్థిక నష్టం జరిగిందని తెలిపారు. బాధితులకు మంత్రివర్గం హృదయపూర్వక నివాళులు అర్పించిందని చెప్పారు. “మంత్రి వర్గం మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తోంది. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థించింది. బాధితుల సహాయం చేస్తున్న వైద్య సిబ్బంది, తదితర సిబ్బందిని అభినందించింది. అమాయకుల ప్రాణనష్టానికి దారితీసిన ఈ దుర్మార్గపు, పిరికి చర్యను మంత్రివర్గం నిస్సందేహంగా ఖండిస్తుంది. ఈ ప్రతికూల పరిస్థితులలో ధైర్యం, కరుణతో సేవలు చేసిన అధికారులు, భద్రతా సంస్థలు, పౌరులను మంత్రివర్గం ప్రశంసించింది. ఈ సంఘటనపై వీలైనంత త్వరగా దర్యాప్తు చేయాలని మంత్రివర్గం ఆదేశించింది. నేరస్థులు, వారికి సహకరించిన వ్యక్తులు, స్పాన్సర్లను త్వరగా గుర్తించాలని ఆదేశిస్తోంది. ప్రభుత్వ అత్యున్నత స్థాయిలో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంటుంది. జాతీయ భద్రత, ప్రతి పౌరుడి భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.” అని ఆయన పేర్కొన్నారు.
READ MORE: Educated Terrorists: 24 ఏళ్లలో 36 సంఘటనలు.. ‘వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్’ ఎప్పుడు ప్రారంభమైంది!