మంగళవారం తమిళనాడులోని చెన్నైలో మిచాంగ్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు పడవలు, ట్రాక్టర్లను ఉపయోగించారు. మంగళవారం ఉదయం నుండి చెన్నైలోని చాలా ప్రాంతాల్లో వర్షం ప్రభావం తక్కువగానే ఉంది. దీంతో రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను అధికారులు వేగవంతం చేశారు. ఇదిలా ఉంటే.. చెన్నై, ఇతర ప్రాంతాలలో వరదల ధాటికి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది గాయపడగా.. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.
నగర శివార్లలోని ముత్యాల్‌పేట ప్రాంతంలో 54 కుటుంబాలను రెస్క్యూ అధికారులు రక్షించారు. అంతేకాకుండా.. అప్పుడే ప్రసవించిన మహిళను నగరంలోని సాలిగ్రామం నుండి సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరోవైపు.. కొత్తూరుపురంలోని పాఠశాల శిబిరంలో లోతట్టు ప్రాంతాలకు చెందిన 250 మందికి పైగా ప్రజలకు ఆశ్రయం కల్పించారు. ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకోవడంతో అందులో ఉన్న 22 మంది ప్రయాణికులను పల్లావరంలోని మిడిల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన సహాయ శిబిరానికి తరలించారు.
Read Also: Mizoram: మిజోరాం ముఖ్యమంత్రిగా లాల్దుహోమ.. డిసెంబర్ 8న ప్రమాణ స్వీకారం
కాగా.. మంగళవారం చెన్నైలోని కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు. కుండపోత వర్షాల ప్రభావంతో చెన్నై సహా తొమ్మిది జిల్లాల్లో మొత్తం 61,666 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశామని, వీటిలో ఇప్పటి వరకు దాదాపు 11 లక్షల ప్యాకెట్ల ఆహారం, లక్ష పాల ప్యాకెట్లు పంపిణీ చేశామని స్టాలిన్ తెలిపారు.
ఇదిలా ఉంటే.. మరికాసేపట్లో మైచాంగ్ తుఫాను ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లను తాకనుంది. మరో రెండు గంటల్లో బాపట్లను తుపాను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. తుఫాను ప్రభావం సమయంలో.. గంటకు 90 నుండి 100 కి.మీ గాలి వీస్తుందని చెప్పారు. దీంతో.. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.