Water Crisis: రాష్ట్రంలోని జలాశయాలు ఎండిపోతున్నాయి. పెరుగుతున్న ఎండల నేపథ్యంలో నది ప్రవాహాలు సన్నని ధారలా కూడా రావడం లేదు. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో ఇప్పటికే నీరు అడుగు పట్టింది. కృష్ణానది పరివాహకంగా ఇప్పటికే పరిస్థితి ఆందోళన కరంగా మారుతోంది. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, కడెం ప్రాజెక్టులో గతేడాదితో పోలిస్తే ఇప్పటికే నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ ఏడాది చాలా ప్రాంతాల్లో వేసవిలో తాగునీటి ఎద్దడి పొంచి ఉంది. ఆరు నెలలుగా సరైన వర్షాల్లేక ప్రధాన జలాశయాలలో నీటి నిల్వలు తగ్గిపోయాయి. ఎగువ నుంచి నీటి ప్రవాహం రాకపోవడం వల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల జలాశయాలు అతి తక్కువ నీటి మట్టానికి నీటి నిల్వలు తగ్గిపోయాయి.
తాగునీరెలా?
జూరాల ప్రాజెక్టులో నీటిమట్టం రోజురోకు తరిగిపోతోంది. 9.66టిఎంసీల నీటినిలువ సామర్ధం ఉన్న ఈ ప్రాజెక్టులో నీటినిలువ 3.20టిఎంసీలకు తగ్గిపోయింది. డెడ్‌స్టోరేజి కింద మిగిలిపోయే నీటిని మినహాయిస్తే లభ్యత నీటి నిలువ ఒక టీఎంసీకంటే మించదని చెబుతున్నారు. మరో వైపు ఎగువన కర్నాటకలో నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి చుక్కనీరు కూడా కిందకు వదలటం లేదు. దీంతో జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీటి ప్రవాహాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ జలాశయంపై ఆధారపడి ఆయకట్టులో వేసిన పంటల పరిస్థితి దయనీయంగా మారింది. సాగునీటి మాట అటుంచి ముందు తాగునీటి అవసరాలకు నీరెలా అన్నదే సందేహంగా మారింది.
పడిపోయిన శ్రీశైలం నీటిమట్టం
కృష్ణానదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టుల్లో ఒకటైన శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం వేగంగా పడిపోతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్న ఈ ప్రాజెక్టులో నీటినిలువ కనిష్ట నీటిమట్టానికి దిగువకు ఎప్పుడో పడిపోయింది. శ్రీశైల ప్రాజెక్టులో నీటిమట్టం 810అడుగులకు పడిపోయింది. రిజర్వాయర్‌లో నీటినిలువ 34.29 టీఎంసీలకు చేరింది. అయితే ఈ రిజర్వాయర్‌లో అత్యవసర పరిస్థితులు అదికూడా తాగునీటి గండం ముంచుకొస్తే 800అడుగుల స్థాయి నీటిమట్టం వరకూ నీటిని ఉపయోగించుకునే వెసులు బాటు కల్పించారు. 800 అడుగుల స్థాయికి పైన 812 అడుగుల స్థాయిలో నీరు నిల్వ ఉంటేనే నీటిలభ్యత కేవలం 7 టీఎంసీలు మాత్రమే అని అధికారులు వెల్లడించారు. 800 అడుగులు అంతకు మించి దిగువకు వెళితే బురద నీరు లభిస్తుందంటున్నారు.
నాగార్జున సాగర్‌లో కనిష్ట స్థాయికి..
నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కనిష్ట స్థాయికంటే కేవలం ఒక అడుగు మాత్రమే మిగిలినట్టు అధికారులు వెల్లడించారు. ఈ జలాశయం గరిష్టస్థాయి 590అడుగుల నీటి మట్టం వద్ద రిజర్వాయర్‌లో గరిష్ఠ స్థాయి నీటినిలువ సామర్ధం 312టీఎంసీలు కాగా, సోమవారం నాటికి రిజర్వాయర్‌లో నీటిమట్టం 511 అడుగులకు పడిపోయింది. ఈ స్థాయిలో నీటినిలువ 134.92 టీఎంసీల నీరు నిలువ ఉంది. ఈ రిజర్వాయర్ కనిష్ట నీటి నిటిమట్టం 510అడుగులు కాగా , ఇక కేవలం ఒక అడుగు మేరకే లభ్యత నీటిమట్టం మిగిలి ఉంది. 510అడుగుల స్థాయికి మించి దిగువకు నీటిని ఈ రిజర్వాయర్ నుంచి తీసుకునే వీలు లేదంటున్నారు. మొత్తంగా ప్రధాన జలాశయాల్లో కనీస నీటి నిల్వలు అడుగంటాయి. నాగార్జున సాగర్,శ్రీశైలంలో నీటి నిల్వ డెడ్ స్టోరేజీకి చేరుకుంది.
అడుగంటిన ఎస్సారెస్పీ..
గోదావరి నదీపరివాహకంగా కూడా జలశయాలు వేగంగా తరిగిపోతున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీరు అడుగంటిన పరిస్థితి నెలకొంది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ 90.31 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 12.64 టీఎంసీలు మాత్రమే ఉంది. దీంతో ఆయకట్టు రైతులకు సాగునీరు అందించలేన పరిస్థితి నెలకొంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ 20.18 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.59 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉంది. కడెం ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 7.60 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 2.60 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. మిడ్ మానేరు గరిష్ట నీటి నిల్వ 27.50 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.59 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉంది. లోయర్ మానేరు గరిష్ట నీటి నిల్వ 24.07 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 5.23 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉంది.
ముంచుకొస్తున్న నీటి గండం
ప్రాజెక్టుల్లో నీటి నిల్వ పూర్తిగా పడిపోవడంతో రాష్ట్రంలో తాగునీటి గండం ముంచుకోస్తోంది. ప్రధాన ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు వేగంగా తరిగిపోతున్నాయి. మరో వైపు భూగర్భ జలమట్టాలు కూడా పడిపోతున్నాయి. వర్షాలు వచ్చేదాక తాగునీటి అవసరాలకోసం ఉన్ననీటి నిలువలతోనే మరో మూడు నెలల పాటు సర్ధుకుపోయాల్సిన పరిస్థితి అనివార్యంగా మారుతోంది. మిషన్‌భగీరధ ద్వారా నల్లా నీరు రాకపోవటంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు సమీపాన ఉన్న వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సైతం పలు కాలనీల్లో నీటికి కటకటలాడాల్సి వస్తోంది. గ్రేటర్ హైరాబాద్ పరిధిలో అప్పుడే తాగునీటి సమస్యలపై నిరసన ధ్వనులు పుట్టుకొస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో సమస్య మరింత ముదురుతోంది. నగరంలో 30లక్షలకు పైగా బోర్లు ఉండగా ,అందులో 30శాతం ఒట్టిపోయాయి. మరో 20శాతం బొటాబొటిగా నీరందిస్తున్నాయి. నల్లా నీటి సరఫరా చాలినంతగా జరగటం లేదంటున్నారు.