Dane van Niekerk Returns Ahead of Women’s World Cup 2025: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం, ఆ తర్వాత కొద్ది రోజులకే యూటర్న్ తీసుకోవడం ఇటీవల సర్వసాధారణం అయింది. షాహిద్ అఫ్రిది, ఏబీ డివిలియర్స్, డేవిడ్ వార్నర్, మహమ్మద్ ఆమీర్, బెన్ స్టోక్స్, తమీమ్ ఇక్బాల్, మొయిన్ అలీ.. లాంటి వారు రిటైర్మెంట్ నుంచి యూటర్న్ తీసుకున్నారు. తాజాగా ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డేన్‌వాన్ నీకెర్క్ చేరారు. తాజాగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటన చేశారు.
‘నేను రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నందుకు సంతోషంగా ఉంది. దేశం కోసం ఆడటం నేను ఎంతగానో మిస్ అయ్యాను. ఇప్పుడు నేను ఆట పట్ల పూర్తి అంకితభావంతో ఉన్నాను. మరలా మైదానంలో ఆడేందుకు సిద్ధంగా ఉన్నాను. నా రిటైర్మెంట్ నిర్ణయం పట్ల క్రికెట్ దక్షిణాఫ్రికాకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నా. అంతర్జాతీయ వేదికపై నా ప్రతిభను మళ్లీ ప్రదర్శించే అవకాశం లభించినందుకు నేను కృతజ్ఞురాలిని. దక్షిణాఫ్రికా జట్టు, మహిళల క్రికెట్ స్థాయి నిరంతరం పెరుగుతోంది. నేను కష్టపడడానికి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. కొత్త శక్తి, ఏకాగ్రతతో తిరిగి వస్తున్నాను. నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని డేన్‌వాన్ నీకెర్క్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.
Also Read: iPhone 16 Price Drop: 35 వేలకే ‘ఐఫోన్ 16’.. ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు భయ్యో!
డేన్‌వాన్ నీకెర్క్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను సెప్టెంబర్ 2021లో ఆడారు. చీలమండ గాయం కారణంగా 2022 ప్రపంచకప్‌లో ఆడలేదు. ఫిట్నెస్ లేకపోవడం, గాయాల బారిన పడుతుండటంతో సెలెక్టర్లు ఆమెను మెగా టోర్నీకి ఎంపిక చేయలేదు. దాంతో 2023లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇచ్చారు. రిటైర్మెంట్ విషయంలో తొందరపడ్డానని తెలుసుకున్న డేన్‌వాన్.. యూటర్న్ తీసుకున్నారు. బోర్డుకు క్షమాపణలు కూడా చెప్పారు. వన్డే ప్రపంచకప్ 2025ను దృష్టిలో ఉంచుకొని సెలెక్టర్లు ఆమెకు 20 మంది బృందంలో అవకాశం ఇచ్చారు. దక్షిణాఫ్రికా సన్నాహక శిబిరంలో సత్తాచాటి.. పాకిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌కు ఎంపికై, ఆపై మెగా టోర్నీలో చోటు సంపాదించడమే లక్ష్యంగా ఉన్నారు. ప్రస్తుతం 32వ పడిలో ఉన్న డేన్‌వాన్.. దక్షిణాఫ్రికా మహిళల జట్టు తరపున 1 టెస్ట్, 107 వన్డేలు, 86 టీ20 మ్యాచ్‌లు ఆడారు.
దక్షిణాఫ్రికా మహిళల ట్రైనింగ్ స్క్వాడ్:
అన్నెకె బాస్చ్, తంజిమ్ బ్రిట్స్, నడినె డి క్లెర్క్, అన్నెరీ డిర్క్‌సెన్, లారా గుడ్‌ఆల్, అయంద హ్లుబీ, సినాలో జఫ్తా, అయబొంగ ఖాక, మసబత క్లాస్, సునే లుస్, ఎలింజ్ మరీ మార్క్స్, కరబొ మెసో, నాన్కులెల్కో మలబా, సేశ్నీ నాయుడు, లుయంద జుజా, తుమి సెఖుఖునె, నాండుమిసో షంగసే, మియనే స్మిత్, ఫయే టన్నిక్లిఫె, డానే వాన్ నీకెర్క్.